Kasganj: కస్‌గంజ్‌లో తుపాకులు, కత్తులతో యువకుల వీరవిహారం.. సంచలనం సృష్టిస్తున్న వీడియో!

  • గణతంత్ర దినోత్సవం సందర్భంగా కస్‌గంజ్‌లో ఘటన
  • ‘భారత్ మాతాకీ జై’ అని నినదించిన యువకుడిని కాల్చి చంపిన మరో వర్గం
  • తాజా వీడియోపై దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు
  • ప్రధాన నిందితుడి అరెస్ట్

గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఉత్తరప్రదేశ్‌లోని కస్‌గంజ్‌లో మతఘర్షణలు చెలరేగి ఓ యువకుడు మరణించాడు. ఇప్పుడీ ఘటనకు సంబంధించిన తాజా వీడియో ఒకటి బయటకు వచ్చి సంచలనం సృష్టిస్తోంది. చేతుల్లో తుపాకులు, కత్తులతో పెద్దగా అరుస్తూ యువకులు వీరవిహారం చేశారు.

రిపబ్లిక్ డే సందర్భంగా ఏబీవీపీ ఆధ్వర్యంలో ‘తిరంగా యాత్ర’ పేరుతో బైక్ ర్యాలీ నిర్వహించారు. ముస్లింలు మెజారిటీ ప్రాంతమైన బదునగర్ మీదుగా యాత్ర సాగుతుండగా ఇరు వర్గాల మధ్య ఘర్షణ ప్రారంభమైంది. ఒకరిపై ఒకరు రాళ్లు విసురుకున్నారు. ఇరు వర్గాలు కాల్పులకు దిగడంతో 22 ఏళ్ల చందన్ గుప్తా మరణించాడు. నౌషద్ అనే మరో వ్యక్తి గాయపడ్డాడు.

తిరంగాయాత్ర సందర్భంగా.. ‘వందేమాతరం’, ‘భారత్ మాతాకీ జై’ అంటూ చందన్ గుప్తా నినాదాలు చేశాడు. భారత్‌లో నివసించాలంటే వందమాతరం అనాల్సిందేనని హెచ్చరికలు జారీ చేశాడు. ఈ ఘర్షణకు ఇదే కారణంగా తెలుస్తోంది. కాగా, తాజాగా వెలుగులోకి వచ్చిన కొద్ది నిడివి ఉన్న వీడియోలో తుపాల మోత స్పష్టంగా వినిపిస్తోంది. యువకులు కత్తులు, తుపాకులతో మరో వర్గంపై దూసుకురావడం కనిపించింది.

చందన్ గుప్తా మృతికి ముందు ఎవరో మేడపై నుంచి ఈ వీడియోను చిత్రీకరించారు. చందన్ గుప్తా హత్యకు సంబంధించి ప్రధాన నిందితుడు సలీంను బుధవారం పోలీసులు అరెస్ట్ చేశారు. తాజా వీడియోపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా, కస్‌గంజ్ ఘర్షణలపై నివేదిక ఇవ్వాలంటూ ఉత్తరప్రదేశ్‌ను కేంద్ర ప్రభుత్వం కోరింది.

  • Loading...

More Telugu News