Chandrababu: ఏపీకి ‘చంద్ర’ గ్రహణం పట్టింది: వైఎస్ జగన్ విమర్శలు
- చంద్రబాబు పాలన అవినీతి, అప్పుల మయం
- అక్రమ నివాసంలో ఉంటున్న చంద్రబాబు
- చంద్రబాబు విదేశాలకు వెళితే సీఎం సీట్లో బాలకృష్ణ కూర్చున్నాడు
- విమర్శలు గుప్పించిన జగన్
వైసీపీ అధినేత జగన్ ప్రజా సంకల్పయాత్ర నెల్లూరు జిల్లాలో కొనసాగుతోంది. సర్వేపల్లి నియోజకవర్గం పొదలకూరు బహిరంగ సభలో జగన్ మాట్లాడుతూ, నాలుగు సంవత్సరాల చంద్రబాబు పాలన రాష్ట్రానికి చంద్రగ్రహణం పట్టిందని విమర్శించారు. ఏపీని అప్పులు, అవినీతి ఆంధ్రప్రదేశ్ గా చేసిన ఘనత ఆయనదేనని ఆరోపించారు.
‘నాలుగేళ్ల చంద్రబాబు పాలన ఎలా ఉందంటే.. రిపబ్లిక్ డే వేడుకలు జరుపుకున్న సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు మనకు కనిపించరు. రాష్ట్రంలో ఎక్కడైనా అక్రమ నివాసాలు ఉంటే వాటిని తొలగించాలి కానీ, చంద్రబాబే అక్రమ నివాసంలో ఉంటున్నారు. ఆ అక్రమ నివాసంలోనే చంద్రబాబు సతీమణి రిపబ్లిక్ డే నాడు జెండా వందనం చేశారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు విదేశాలకు వెళితే, ఆయన బావమరిది బాలకృష్ణ సీఎం సీటులో కూర్చుంటాడు. ‘చంద్ర’ గ్రహణం రాష్ట్రానికి ఏ స్థాయిలో పట్టిందంటే.. దుర్గగుడిలో అర్చకులు, పూజారులు పూజలు చేస్తారు. కానీ, ఈరోజున తాంత్రికులు, మాంత్రికులు పూజలు చేస్తున్నారు’ అని జగన్ విమర్శలు గుప్పించారు.