Hyderabad: వీడిన చందానగర్ హత్యల కేసు మిస్టరీ.. భార్యల గొడవ భరించలేకే చంపేశానన్న నిందితుడు

  • పోలీసుల ఎదుట లొంగిపోయిన మధు
  • నేరాన్ని అంగీకరించిన నిందితుడు
  • మీడియా సమావేశంలో హత్య కేసు వివరాలు వెల్లడించిన పోలీసులు

సంచలనం సృష్టించిన హైదరాబాదు శివారు చందానగర్ హత్యల కేసులో పోలీసులకు లొంగిపోయిన నిందితుడు మధు నేరాన్ని అంగీకరించాడు. హత్యల విషయం వెలుగు చూడడంతో పోలీసులకు లొంగిపోయిన మధు హత్యలు ఎందుకు చేయాల్సి వచ్చిందన్న విషయాన్ని పోలీసులకు వెల్లడించాడు. భార్యల గొడవ భరించలేకే అపర్ణను చంపేశానని పేర్కొన్నాడు. మంగళవారం రాత్రి ఆర్సీపురం పోలీసులు హత్య కేసు వివరాలను వెల్లడించారు.

పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులోని ఉలంపర్రుకు చెందిన మధు పదో తరగతి చదువుతూ బతుకు తెరువు కోసం హైదరాబాద్ వచ్చాడు. ఈ క్రమంలో అపర్ణాదేవితో ఏర్పడిన స్నేహం ప్రేమగా మారడంతో 2008లో ఎవరికీ తెలియకుండా ఓ గుడిలో వివాహం చేసుకున్నాడు. 2013 వీరికి కార్తికేయ అనే పాప పుట్టింది. విషయం తెలిసిన బంధువులు మేనమామ కుమార్తె అయిన యామినితో బలవంతంగా మధుకు మరో పెళ్లి చేశారు. దీంతో అపర్ణకు, మధుకు మధ్య గొడవలు మొదలయ్యాయి. మరోవైపు తరచూ అపర్ణ వద్దకు వెళ్లి వస్తున్నాడని అనుమానించిన యామిని పలుమార్లు భర్తను నిలదీసింది.

ఈనెల 26న యామినితో ఫోన్లో మాట్లాడిన అపర్ణ ఆ సంభాషణను రికార్డు చేసి భర్తకు వినిపించింది. దీంతో ఆగ్రహంతో ఊగిపోతూ అపర్ణ ఇంటికి వెళ్లిన మధు ఆమె తల్లి విజయలక్ష్మితో గొడవపడి చంపేశాడు. అనంతరం కుమార్తె కార్తికేయ మెడకు చున్నీ బిగించి ఆమెనూ హత్య చేశాడు. మధ్యాహ్నం అపర్ణ భోజనానికి ఇంటికి వచ్చే వరకు అక్కడే కాపుకాశాడు. ఆమె వచ్చాక చున్నీతో గొంతుకు ఉరేసి చంపాలనుకున్నాడు.

అయితే ఆమె ప్రతిఘటించడంతో రోకలి బండతో మోది చంపేసి ఇంటికి తాళం వేసి వెళ్లిపోయాడు. నేరుగా భార్య యామిని వద్దకు వెళ్లి హత్యల విషయాన్ని చెప్పాడు. దీంతో ఆమె ఈనెల 28న తల్లి గారింటికి వెళ్లిపోయింది. హత్యల విషయం వెలుగు చూడడంతో అరెస్ట్ తప్పదని భావించిన మధు నేరుగా వెళ్లి పోలీసులకు లొంగిపోయాడు. అంతకుముందు ఆర్సీపురంలోని గణపతి లాడ్జిలో ఓ గదిని అద్దెకు తీసుకుని ఆత్మహత్యకు యత్నించినట్టు పోలీసులు తెలిపారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు రిమాండ్‌కు తరలించారు.

  • Loading...

More Telugu News