Pawan Kalyan: అమరావతిలో రాయలసీమ ప్రజలకు సరైన ప్రాధాన్యత కల్పించడం లేదు: పవన్ కల్యాణ్
- హిందూపురంలో పర్యటించిన ‘జనసేన’ అధినేత
- రాయలసీమలో ప్రజలు పడుతున్న ఇబ్బందులు నాకు తెలుసు
- సీమకు అండగా, కోనసీమకు బాసటగా నిలుస్తా
- ప్రత్యేకహోదాపై టీడీపీ, బీజేపీ, వైసీపీ లు తమ వైఖరి స్పష్టం చేయాలన్న పవన్ కల్యాణ్
నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో రాయలసీమ ప్రజలకు సరైన ప్రాధాన్యత కల్పించడం లేదని జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ విమర్శించారు. అనంతపురం జిల్లా హిందూపురంలో పవన్ ఈరోజు పర్యటించారు. పట్టణంలోని తెలుగు తల్లి విగ్రహం నుంచి ప్రారంభమైన ర్యాలీ ఆయా ప్రాంతాల మీదుగా సాగింది. అంబేద్కర్ కూడలిలోని బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి ఆయన పూలమాల వేసి నివాళులర్పించారు.
అనంతరం, జేవీఎస్ ప్యాలెస్ లో జనసేన పార్టీ కార్యకర్తల సమావేశంలో పవన్ మాట్లాడుతూ, రాయలసీమలో ప్రజలు పడుతున్న ఇబ్బందులు తనకు తెలుసని, ప్రభుత్వాలు వారికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. రాయలసీమకు అండగా, కోససీమకు బాసటగా నిలుస్తానని పవన్ హామీ ఇచ్చారు. రాయలసీమలో హైకోర్టు ఏర్పాటు చేసేందుకు ఒత్తిడి తీసుకురావాలని హిందూపురం న్యాయవాదులు ఆయన దృష్టికి తెచ్చారు. ఈ విషయమై ప్రభుత్వ పెద్దలతో మాట్లాడతానని వారికి పవన్ హామీ ఇచ్చారు.
ప్రత్యేకహోదాపై టీడీపీ, బీజేపీ, వైసీపీ లు తమ వైఖరిని స్పష్టం చేయాలని పవన్ అన్నారు. ఈ సందర్భంగా పార్టీ కార్యకర్తలకు ఆయన పలు సూచనలు చేశారు. ‘జనసేన’ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పార్టీ నాయకులు, కార్యకర్తలకు సూచించారు. తమ పార్టీ నిబద్ధత కలిగిన పార్టీ అని, ప్రజలకు న్యాయం చేసేందుకు ఎలాంటి పోరాటాలకైనా వెనుకాడదని పవన్ ఉద్వేగపూరిత ప్రసంగం చేశారు.