bike race: బైక్ రేసుల్లో పాల్గొనే రోబో... తయారు చేసిన యమహా... వీడియో చూడండి!
- రోబో పేరు మోటోబోట్
- గంటకి 200 కి.మీ.ల వేగంతో నడపగల రోబో
- నాలుగేళ్లు కష్టపడి తయారుచేసిన ఇంజినీర్లు
కాలిఫోర్నియాకు చెందిన ఎస్ఆర్ఐ ఇంటర్నేషనల్ పరిశోధనా సంస్థతో కలిసి యమహా మోటార్ కార్పోరేషన్ వారు రేసుల్లో బండి నడపగల రోబోను తయారు చేశారు. దీని పేరు మోటోబోట్. గంటకి 200 కి.మీ.ల వేగంతో బండి నడపగల ఈ రోబోను నాలుగేళ్ల పాటు కష్టపడి తయారుచేశారు. ఈ తయారీలో భాగంగా రెండుసార్లు పెద్ద ప్రమాదాలు కూడా జరిగినట్లు మోటోబోట్ ప్రాజెక్ట్ లీడర్ హిరోషి సైజో తెలిపారు.
రేసులో బైక్ నడుపుతున్న వ్యక్తి అనుభవాలు, ఆలోచనలు అధ్యయనం చేసి ఈ రోబోను సృష్టించినట్లు ఎస్ఆర్ఐ ఇంటర్నేషనల్ పరిశోధకుడు బ్రయన్ ఫోస్టర్ చెప్పారు. యమహా వైజెడ్ఎఫ్-ఆర్1ఎం బైక్ మీద ఈ మోటోబోట్‌ను అమర్చి వారు ప్రయోగాలు చేశారు. ఆ ప్రయోగాలకు సంబంధించిన వీడియోను వారు విడుదల చేశారు. ఇందులో 9 సార్లు గ్రాండ్‌ప్రీ ఛాంపియన్ వాలెంటినో రొస్సీతో మోటోబోట్ తలపడి ఓడిపోవడం చూడొచ్చు. దీనికి సంబంధించి మూడో వెర్షన్‌ని తయారు చేసి రొస్సీని ఓడించే ప్రయత్నం చేస్తామని ఇంజినీర్లు చెప్పారు. రేస్‌ల కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఈ రోబోలో జీపీఎస్, శాటిలైట్, డ్రోన్ టెక్నాలజీ ఉపయోగించినట్లు తెలుస్తోంది.