game: గేమర్లకు శుభవార్త...గేమ్‌ని లైవ్ స్ట్రీమ్ చేసి డబ్బులు సంపాదించుకునే అవకాశం
- ప్రయోగాత్మక దశలో గేమ్ ప్లే
- అంతర్జాతీయంగా 2 బిలియన్ల వినియోగదారులకు స్ట్రీమింగ్
- ప్రస్తుతానికి డెస్క్‌టాప్ యూజర్లకు మాత్రమే
యూట్యూబ్ తరహాలో సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్ కూడా గేమర్లకు డబ్బులు సంపాదించుకునే అవకాశం కల్పించింది. తాము ఆడుతున్న గేమ్‌ను లైవ్ స్ట్రీమ్ ద్వారా ఫేస్‌బుక్‌కి అనుసంధానించడం ద్వారా డబ్బులు సంపాదించుకోవచ్చు. యూట్యూబ్‌కి పోటీగా ఫేస్బుక్ ఫర్ క్రియేటర్స్ పేరుతో ఏర్పాటు చేసిన వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫాంలో ఈ సదుపాయాన్ని ప్రవేశపెట్టింది.
ప్రస్తుతం ఈ గేమ్ ప్లే సదుపాయాన్ని కొంతమందికి మాత్రమే అందుబాటులోకి తీసుకువచ్చింది. దీని ద్వారా అంతర్జాతీయంగా ఉన్న 2 బిలియన్ల మంది ఫేస్బుక్ వినియోగదారులు గేమింగ్ వీడియోను ప్రసారం చేసే అవకాశం ఉంది. గేమర్లు ఆడుతుండగా వారు ఆడే విధానాన్ని చూసేందుకు చాలా మంది ఆసక్తి చూపిస్తుంటారు. దీని ఆధారంగా ట్విచ్ అనే వెబ్సైట్ లైవ్ గేమ్ స్ట్రీమింగ్‌ని ప్రారంభించింది. ఆ తర్వాత యూట్యూబ్ కూడా ఈ సదుపాయాన్ని ప్రవేశపెట్టింది.
ఇప్పుడు అదే బాటలో ఫేస్బుక్ కూడా పయనిస్తుండటంతో ఇంట్లో కూర్చుని గేమ్స్ ఆడేవారికి మరింత సదుపాయం చేకూరనుంది. ప్రస్తుతం డెస్క్‌టాప్ యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉన్న ఈ ఫీచర్ ద్వారా కనిష్టంగా 3 డాలర్ల వరకు సంపాదించుకునే అవకాశం ఉందని టెక్ క్రంచ్ మేగజైన్ పేర్కొంది. అయితే మానిటైజింగ్ విధానాల గురించి ఫేస్బుక్ ఇంకా ఎలాంటి అధికారిక స్పష్టతను ఇవ్వలేదు.