Padmaavat: మొదటి వారాంతంలో రూ. 100 కోట్ల మార్కు దాటిన 'పద్మావత్'
- సినిమాకు కలిసొచ్చిన దీర్ఘవారాంతం
- శని, ఆది వారాల్లో పెరిగిన కలెక్షన్లు
- వివాదాలు, ఆందోళనలను తలదన్నేలా వసూళ్లు
తీవ్ర నిరసనలు, ఆందోళనల మధ్య విడుదలైనప్పటికీ వసూళ్ల విషయంలో 'పద్మావత్' చిత్రం ఏ మాత్రం తగ్గడం లేదు. మొదటి రెండ్రోజుల్లోనే రూ. 50 కోట్ల మార్కును దాటేసిన ఈ చిత్రం, మొదటి వారాంతానికి రూ. 100 కోట్ల మార్కును దాటింది. గణతంత్ర దినోత్సవం సందర్భంగా శుక్ర, శని, ఆదివారాల్లో దీర్ఘవారాంతం ఈ సినిమాకు కలిసొచ్చింది. శని, ఆదివారాల్లో మెట్రో నగరాల్లో ఎక్కువ కలెక్షన్లు వచ్చినట్లు తెలుస్తోంది.
పెయిడ్ ప్రీవ్యూస్‌తో కలిపి నాలుగు రోజుల్లో పద్మావత్ చిత్రం రూ. 110 కోట్ల వరకు వసూలు చేసినట్లు బాక్సాఫీస్ ఇండియా వెబ్‌సైట్ పేర్కొంది. నిజానికి విశ్లేషకుల అంచనా ప్రకారం మొదటి వారాంతంలో రూ. 140 కోట్లకు పైగా వసూలు చేయాల్సి ఉంది. కానీ కొన్ని రాష్ట్రాల్లో సినిమా ప్రదర్శనకు అడ్డంకులు రావడంతో వసూళ్లు పడిపోయాయని బాక్సాఫీస్ ఇండియా వెల్లడించింది. ఈ చిత్రం బుధవారం రూ. 5 కోట్లు (పెయిడ్ ప్రీవ్యూస్), గురువారం రూ. 19 కోట్లు, శుక్రవారం రూ. 32 కోట్లు, శనివారం రూ. 27 కోట్లు, ఆదివారం రూ. 30 కోట్లు వసూలు చేసినట్లు తెలుస్తోంది. ఈ సినిమాను దర్శకుడు సంజయ్‌లీలా భన్సాలీ, వయాకామ్ 18 సంస్థతో కలిసి రూ. 180 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించారు.