IPL: ఐపీఎల్ చిత్రాలు... అపర కుబేరుడికి దక్కింది రూ. 30 లక్షలే అయితే, సెక్యూరిటీ గార్డుకు రూ. 20 లక్షల జాక్ పాట్!

  • బిర్లా వారసుడిని దక్కించుకున్న రాజస్థాన్ రాయల్స్
  • పంజాబ్ ఫ్రాంచైజీకి చేరిన సెక్యూరిటీ గార్డు మంజూర్ దార్
  • ఐపీఎల్ వేలం తరువాత హాట్ టాపిక్

ఆర్యమాన్ విక్రమ్ బిర్లా... ఇండియాలోని వ్యాపార దిగ్గజ కుటుంబాల్లో ఒకటైన బిర్లా సామ్రాజ్యానికి వారసుడు. కుమార మంగళం బిర్లా కుమారుడు. పుట్టుకతోనే నోట్లో వెండి స్పూన్ పెట్టుకుని పుట్టాడని చెప్పవచ్చు.

మంజూర్ దార్... కాశ్మీర్ లో కూలి పని చేసుకునే వ్యక్తి ఇంట పుట్టిన బిడ్డ. రోజు గడిచేందుకు సెక్యూరిటీ గార్డుగా పని చేస్తుంటాడు. రెక్కాడితేగాని డొక్కాడని పరిస్థితి.

కానీ, వీరిద్దరి కలా ఒక్కటే. క్రికెటర్ గా రాణించాలని, తమను తాము నిరూపించుకోవాలని తపన పడుతుంటారు. అందుకు అనునిత్యమూ శ్రమిస్తుంటారు కూడా. ఇక వీరిద్దరూ ఐపీఎల్ 11వ సీజన్ వేలం కోసం రాగా, ఆర్యమాన్ ను రాజస్థాన్ రాయల్స్ జట్టు రూ. 30 లక్షలకు కొనుగోలు చేయగా, పంజాబ్ ఫ్రాంచైజీ మంజూర్ దార్ ను రూ. 20 లక్షలకు సొంతం చేసుకుంది.

భిన్న నేపథ్యాలు కలిగిన వీరిద్దరూ ఐపీఎల్ వేలం తరువాత హాట్ టాపిక్ గా మారారు. తన చేతులతో కోట్లు ఖర్చుబెట్టే ఆర్యమాన్ కు రూ. 30 లక్షల మొత్తం చాలా తక్కువ కాగా, పేదరికంలో మగ్గే మంజూర్ కు ఈ రూ. 20 లక్షలు ఎంత ముఖ్యమో వేరే చెప్పనక్కర్లేదు. ఓ రకంగా అతనికిది లైఫ్ టైం అవకాశాన్ని కలిగించిన జాక్ పాటే. ఇక మరో రెండు నెలల తరువాత జరిగే పోటీల్లో ఎవరి సత్తా ఏ మేరకు తమ ఫ్రాంచైజీలకు మేలు కలిగిస్తుందో వేచి చూడాలి.

  • Loading...

More Telugu News