Anantapur District: మాట్లాడి మాట్లాడి గొంతు తడారిపోయింది!: పవన్ కల్యాణ్

  • ధర్మవరం చేనేత కార్మికులతో పవన్ సమావేశం
  • చేనేత కార్మికులకు అండగా ఉంటానని హామీ
  • వృత్తి నైపుణ్యం అంతరించకుండా చూస్తానని వెల్లడి

గడచిన పది రోజులుగా మాట్లాడి, మాట్లాడి తన గొంతు తడారిపోయిందని పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. కొద్దిసేపటి క్రితం ధర్మవరం చేరుకున్న ఆయన చేనేత కార్మికులతో సమావేశమై ప్రసంగించారు. తన గొంతు నుంచి రక్తం వచ్చేంతగా దగ్గుతున్నానని కూడా పవన్ చెప్పారు. జనసేన పార్టీ చేనేత కార్మికులకు అండగా ఉంటుందని, తాను మనస్ఫూర్తిగా, చిత్తశుద్ధిగా ప్రజా సమస్యలను తెలుసుకోవడం కోసమే తొలి దశ పర్యటన సాగిస్తున్నానని స్పష్టం చేశారు.

అన్ని సమస్యల పరిష్కారాలనూ తన మేనిఫెస్టోలో చేరుస్తానని అన్నారు. అందుకు తనకు కొద్ది రోజుల సమయం కావాలని, పవర్ లూమ్స్ కు తాను వ్యతిరేకిని కాదని, వాటివల్ల కార్మికులు, చేనేత కళాకారుల వృత్తి నైపుణ్యం అంతరించి పోకుండా చూడాలన్నదే తన లక్ష్యమని తెలిపారు. ఈ మేరకు సమస్యలు ఎక్కడ ఉన్నాయో తనకు సలహాలు, సూచనలు ఇవ్వాలని కోరారు.

ధర్మవరానికి చేనేత బ్రాండ్ ను తెచ్చే బాధ్యత తనదేనని, నేతన్న కన్నీరు తుడిచి, వారికి అండగా ఉంటానని పవన్ స్పష్టం చేశారు. విదేశాల్లో వృత్తి కళాకారులకు ప్రాధాన్యత ఎంతో ఉందని, విదేశాల నుంచి డిజైన్లు తెచ్చి, వాటిని ఇక్కడ నేయాలని సూచించారు. తన పర్యటనకు ప్రజల నుంచి ఎంతో స్పందన వచ్చిందని, చాలామంది ఎమ్మెల్యేలు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు తమ ఇంటికి రావాలని ఆహ్వానించారని, సమయాభావం వల్ల వెళ్లలేకపోయానని అన్నారు. కాగా, తాను మాట్లాడుతున్న సమయంలో పలుమార్లు పవన్ కల్యాణ్ కు దగ్గు రాగా, జనసేన కార్యకర్తలు మంచినీళ్లు అందించారు.

Anantapur District
Dharmavaram
Pawan Kalyan
Powerlooms
  • Loading...

More Telugu News