Madhya Pradesh: అచ్చం సినిమాలోలా! డయల్ 100 వాహనాన్ని హైజాక్ చేసి.. పోలీసుల చేతులు కట్టేసి.. యువతిని కిడ్నాప్ చేసిన దుండగులు!
- యువతి కిడ్నాప్ కోసం పోలీసు వాహనాన్ని హైజాక్ చేసిన దుండగులు
- సినిమాను తలపించిన కిడ్నాప్ వ్యవహారం
- నిందితుల కోసం వేట ప్రారంభించిన పోలీసులు
- సంచలనం సృష్టిస్తున్న కిడ్నాప్
సినిమా సీన్లను వీరు వాడుకుంటున్నారో.. లేక జరుగుతున్న వాటినే సినిమాలో పెడుతున్నారో తెలియదు కానీ.. మధ్యప్రదేశ్‌లో ఓ కిడ్నాప్ గ్యాంగ్ యువతిని కిడ్నాప్ చేసేందుకు ఏకంగా డయల్ 100 పోలీసు వాహనాన్ని హైజాక్ చేసింది. అనంతరం పోలీసుల దుస్తులను విప్పించి, ఆ దుస్తులు ధరించి యువతిని కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించారు. ఆదివారం ఉదయం జరిగిందీ ఘటన.
నిందితుల కోసం వేట ప్రారంభించినట్టు పన్నా ఎస్పీ ఇక్బాల్ రియాజ్ తెలిపారు. 45 నిమిషాల పాటు వాహనం కిడ్నాపర్ల చేతిలో ఉన్నట్టు పేర్కొన్నారు. రియాజ్ కథనం ప్రకారం.. శనివారం రాత్రి 11:30 గంటలకు డయల్ 100 కు కాల్ వచ్చింది. ఏఎస్సై సుభాష్ దూబే, హెడ్ కానిస్టేబుల్ ప్రకాశ్ మండల్, డ్రైవర్ షరాఫత్ ఖాన్‌లు అప్రమత్తమై కాల్ వచ్చిన బామోరి గ్రామ శివారుకి వెళ్లారు.
అక్కడో వ్యక్తి నేలపై పడి ఉన్నాడు. అప్రమత్తమైన పోలీసులు అతడి వద్దకు వెళ్లి అతడిని తమ వైపునకు తిప్పగానే అతడు పిస్టల్‌తో పోలీసులకు గురిపెట్టాడు. ఆ తర్వాత మరో ఇద్దరు అక్కడికి చేరుకుని పోలీసులను అదుపులోకి తీసుకున్నారు. వారి దుస్తులు విప్పించి చేతులు కట్టేశారు.
అనంతరం పోలీసులు యూనిఫాం ధరించి గ్రామంలోని ఓ 20 ఏళ్ల యువతి ఇంటికి వెళ్లి డోరు కొట్టారు. అయితే అర్ధరాత్రి కావడంతో తలపు తెరిచేందుకు సంశయించినట్టు యువతి తండ్రి తెలిపాడు. కిటికీ లోంచి బయటకు చూసి పోలీసు వాహనం కనిపించడంతో డోర్ తెరిచినట్టు వివరించాడు.
తన కుమార్తెను పోలీసు స్టేషన్‌కు తీసుకెళ్లి వాంగ్మూలం నమోదు చేయాల్సి ఉందని దుండగులు చెప్పడంతో అతడి అనుమానం మరింత రెట్టింపు అయింది. అయితే తనను కూడా రావాలని చెప్పడంతో వారితో వెళ్లినట్టు యువతి తండ్రి తెలిపాడు. వాహనంలో కొద్దిదూరం వెళ్లాక తనను కిందికి తోసేసి వెళ్లిపోయారని పోలీసులకు వివరించాడు.
యువతిని కిడ్నాప్ చేసిన దుండగులు నేరుగా పోలీసుల వాహనాన్ని హైజాక్ చేసిన ప్రాంతానికి చేరుకుని వాహనాన్ని, దుస్తులను పోలీసులకు అప్పగించి యువతితో పరారయ్యారు. పోలీసు స్టేషన్‌కు చేరుకున్న పోలీసులు జరిగింది వివరించడంతో విషయం వెలుగులోకి వచ్చినట్టు రియాజ్ తెలిపారు.
నిందితుల్లో ఒకరిని గుర్తించినట్టు చెప్పిన పోలీసులు అంతకుమించిన వివరాలు వెల్లడించేందుకు నిరాకరించారు. కిడ్నాప్ ఎందుకు చేశారన్న విషయం తెలియరాలేదు. కాగా, ఆదివారం మధ్యాహ్నం వరకు కిడ్నాప్ విషయం ఎవరికీ తెలియకపోవడం గమనార్హం. కిడ్నాపర్ల కోసం గాలిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.