Teacher: వచ్చే ఎన్నికల్లో బీజేపీకి ఓటు వెయ్యొద్దు.. విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించిన మధ్యప్రదేశ్ టీచర్లు!

  • ఆన్‌లైన్ ఎగ్జామ్స్‌పై గుర్రుగా ఉన్న విద్యార్థులు
  • ఈ విధానాన్ని రద్దు చేసే వరకు ఓటేయబోమని విద్యార్థుల ప్రతిన
  • ఇటార్సీలోని ఐటీఐలో  ఘటన

పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఉపాధ్యాయులు రాజకీయ నాయకుల అవతారమెత్తారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేయవద్దని ప్రతిజ్ఞ చేయించారు. అది కూడా గణతంత్ర దినోత్సవం నాడు. ఆలస్యంగా వెలుగుచూసిన ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని ఇటార్సీలో చోటుచేసుకుంది. ఇక్కడి విజయలక్ష్మి ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్‌లో 26న గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. అనంతరం విద్యార్థులతో చేయించిన ప్రతిజ్ఞ ఇప్పుడు వివాదాస్పదమైంది. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

విద్యార్థులను వరస క్రమంలో నిలబెట్టిన టీచర్లు.. వచ్చే లోక్‌సభ, శాసనసభ ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేయబోమని ప్రతిజ్ఞ చేయించారు. ఆన్‌లైన్ పరీక్ష విధానాన్ని బీజేపీ ప్రభుత్వం రద్దు చేసే వరకు బీజేపీకి సహకరించబోమని చెప్పించారు.

సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్న ఈ వీడియో నిమిషం నిడివితో ఉంది. వరుసగా నిల్చున్న విద్యార్థులతో ఉపాధ్యాయులు పలుమార్లు బీజేపీకి ఓటు వేయబోమని ప్రతిజ్ఞ చేయించడం వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ బీజేపీకి  కానీ, ఆ పార్టీ వలంటీర్లు, కార్యకర్తలకు కానీ మద్దతు ఇచ్చేది లేదని విద్యార్థులతో చెప్పించారు.

ప్రస్తుతం మధ్యప్రదేశ్‌లో బీజేపీ అధికారంలో ఉంది. శివరాజ్ సింగ్ చౌహాన్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. 12 ఏళ్లుగా అధికారంలో ఉన్న బీజేపీకి ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో కొంత వ్యతిరేకత వ్యక్తమైంది. అంతేకాదు.. పరీక్షలను ఆన్‌లైన్ పద్ధతిలో నిర్వహిస్తుండడంపై విద్యార్థుల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. ఈ నేపథ్యంలో విద్యార్థులతో ఇలా ప్రతిజ్ఞ చేయించారు.

  • Loading...

More Telugu News