beating: అబద్ధం చెప్పినందుకు 10 ఏళ్ల బాలుడ్ని చావగొట్టిన తండ్రి... వీడియో తీసిన తల్లి

  • బెంగళూరులో జరిగిన ఘటన
  • ఫోన్ ను సర్వీసింగ్ కు ఇవ్వడంతో వెలుగులోకి
  • కేసు నమోదు చేసిన పోలీసులు

ఐటీ రాజధాని బెంగళూరులో దారుణం చోటు చేసుకుంది. తప్పు చేస్తే తల్లిదండ్రులు పిల్లల్ని దండించడం సర్వ సాధారణమే. కానీ, ఇక్కడ మాత్రం ఓ 30 ఏళ్ల వయసున్న వ్యక్తి, తన కుమారుడి విషయంలో రాక్షసుడిగా మారిపోయాడు. పదే పదే అబద్ధాలు చెబుతున్న పదేళ్ల కుమారుడిని అతి క్రూరంగా శిక్షించాడు. పెద్దగా కేకలు పెడుతూ, ప్రాధేయపడినా తండ్రి కోపం చల్లారలేదు. బాలుడి చేయిపై మొబైల్ చార్జర్ తో ఏడు సార్లు కొట్టాడు. ఆ తర్వాత చెంపలు వాయించాడు. మెడను చేత్తో పట్టుకుని ఎత్తి మంచంపై కుదేశాడు.

ఇంతటితోనూ దండన ఆగలేదు. నేలపై పడేసి కాలితో తన్నడం మొదలు పెట్టాడు. పెద్దగా ఏడుస్తుండగా, ‘‘ఎన్ని సార్లు చెప్పాను నీకు అబద్ధం చెప్పొద్దని’’ అంటూ తన్నుతూనే ఉన్నాడు. అవును చాలా సార్లంటూ ఆ బాలుడు బదులివ్వడం వీడియోలో రికార్డయింది. దీన్ని వీడియో తీయమని భార్యకు చెప్పి మరీ అతడు దండించాడు. తర్వాత ఆ వీడియో బాలుడికి చూపిస్తే మరోసారి అబద్ధం చెప్పడన్నది అతడి ఆలోచన.

ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లోకి చేరింది. అయితే, ఇటీవలే మొబైల్ ఫోన్ ను సర్వీసింగ్ కు ఇవ్వడంతో టెక్నీషియన్ అందులోని వీడియో చూసి ఓ స్వచ్చంద సంస్థకు తెలియజేశాడు. వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. జువైనల్ యాక్ట్ కింద పోలీసులు కేసు నమోదు చేసి బాలుడి తండ్రిని అరెస్ట్ చేశారు. 

  • Loading...

More Telugu News