Narendra Modi: ఎవరి సిఫార్సులూ చూడను... అవార్డులు వాటంతట అవే వెతుక్కుంటూ వస్తాయి: నరేంద్ర మోదీ
- సేవ చేసేవారిని అవార్డులు వెతుక్కుంటూ వస్తాయి
- పద్మ పురస్కారాలను పారదర్శకం చేశాం
- 'మన్ కీ బాత్'లో ప్రధాని
గడచిన మూడు సంవత్సరాలుగా 'పద్మ' పురస్కారాల ఎంపిక ప్రక్రియను పూర్తి పారదర్శకం చేశామని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. ఈ ఉదయం ఆల్ ఇండియా రేడియో మాధ్యమంగా 'మన్ కీ బాత్'లో ప్రసంగించిన ఆయన, ప్రజలకు సేవ చేసే వ్యక్తులకు ఎవరి సిఫార్సులూ అవసరం లేకుండానే అవార్డులు వెతుక్కుంటూ వస్తాయని అన్నారు. ఈ సంవత్సరం పద్మ అవార్డులను చూసిన వారు ఎవరైనా ఈ విషయాన్ని అంగీకరించాల్సిందేనని చెప్పారు.
చాలా మంది సామాన్యులకు అవార్డులను దగ్గర చేశామని అన్నారు. పేర్లతో సంబంధం లేకుండా వారు చేసిన సేవలను చూసి మాత్రమే విజేతలను ఎంపిక చేశామని మోదీ అన్నారు. కేరళలోని లక్ష్మీ కుట్టిని జ్ఞాపకం చేసుకుంటూ, ఓ చిన్న గుడిసెలో ఉండే ఆమె, ఆడవుల్లోని 500 రకాల మొక్కలను గుర్తు పెట్టుకుని, వాటితో ఔషధాలు తయారు చేస్తున్నదని, ఆమెను గత ప్రభుత్వాలు గుర్తించలేకపోవడం సిగ్గు చేటని అన్నారు.
జనవరి 30న మహాత్మా గాంధీ వర్థంతిని నిర్వహించుకోనున్నామని గుర్తు చేసిన ఆయన, గాంధీ చూపిన స్ఫూర్తిని అందిపుచ్చుకోవాలని పిలుపునిచ్చారు. రిపబ్లిక్ దినోత్సవం నాడు భారత పదాతి దళాలు, ముఖ్యంగా బీఎస్ఎఫ్ జవాన్లను, యువ మహిళా రక్తం నిండిన సీమా భవానీ కంటింజంట్ ను చూస్తుంటే తనకెంతో గర్వంగా అనిపించిందని తెలిపారు. నాసా ఆస్ట్రొనాట్ కల్పనా చావ్లాకు నివాళులు అర్పిస్తూ, ప్రారంభమైన ఆయన ప్రసంగం, పలు అంశాలను స్పృశిస్తూ, 2018 సంవత్సరం ప్రతి ఒక్కరికీ మంచి చేయాలని కోరడంతో ముగిసింది.