Tirumala: ఆధిపత్య పోరు... డాలర్ శేషాద్రికి నోటీసులు పంపిన రమణ దీక్షితులు!
- రమణ దీక్షితులుపై పలు ఆరోపణలు చేసిన డాలర్ శేషాద్రి
- చర్యలు ఎందుకు తీసుకోకూడదంటూ రమణ దీక్షితులు షోకాజ్ నోటీసులు
- ఆధిపత్య పోరుతో ఆలయ ప్రతిష్ఠ దెబ్బతింటోందని భక్తుల వ్యాఖ్యలు
కలియుగ దైవం తిరుమల శ్రీనివాసుని సన్నిధిలో ఆలయ ప్రధాన అర్చకుడు రమణ దీక్షితులు, ఆలయ ప్రత్యేక అధికారి డాలర్ శేషాద్రి మధ్య ఆధిపత్య పోరు మరింతగా పెరిగింది. మిరాశీ వ్యవస్థ ఎన్నడో రద్దయినా రమణ దీక్షితులు ఇంకా పాటిస్తూనే ఉన్నారని, గర్భగుడిలోకి తన మనవడిని తీసుకు వెళ్లారని ఇటీవల డాలర్ శేషాద్రి బహిరంగంగానే ఆరోపించిన సంగతి తెలిసిందే.
ఇది నిబంధనలకు విరుద్ధమని, చర్యలు ఎందుకు తీసుకోరాదో తెలియజేయాలని డిమాండ్ చేస్తూ, రమణ దీక్షితులు ఓ షోకాజ్ నోటీసును డాలర్ శేషాద్రికి పంపడం ఇప్పుడు చర్చనీయాంశమైంది.
దశాబ్దాల కాలంగా స్వామివారి సేవలో తరిస్తున్న వీరు ఆలయానికి వచ్చే ప్రతి వీఐపీకి, ఉన్నతాధికారులకు, బడా బాబులకు సుపరిచితులే. కేంద్రం నుంచి ఏ మంత్రి వచ్చినా, అమితాబ్ వంటి సినీ దిగ్గజాలు వచ్చినా, అంబానీల వంటి పారిశ్రామికవేత్తలు వచ్చినా వీరిని కలవాల్సిందే. ఇప్పుడు వీరిద్దరి మధ్యా ఏర్పడిన వివాదం గాలివానగా మారింది.
ఆలయ ఆచార వ్యవహారాలను రమణ దీక్షితులు సరిగ్గా పాటించడం లేదని ఇటీవల డాలర్ శేషాద్రి సంచలన విమర్శలు చేశారు. తనకు దగ్గరిగా ఉన్న కొందరు అర్చకులను ఆయన నిత్యమూ అవమానిస్తున్నారని, అనుచితంగా ప్రవర్తిస్తున్నారని కూడా ఆరోపించారు. ఈ మాటలే వారిద్దరి మధ్యా దూరాన్ని పెంచాయని టీటీడీ అధికారులు అంటున్నారు. రమణ దీక్షితులపై కోర్టుకు ఎక్కిన డాలర్ శేషాద్రి కోర్టు నోటీసులు కూడా పంపించారు. కోట్లాది మంది హిందువుల ఆరాధ్య దైవమైన తిరుమల శ్రీవారి సన్నిధిలో ఈ ఆధిపత్య పోరుతో, నోటీసుల పర్వంతో ఆలయ ప్రతిష్ఠ దెబ్బతింటోందని భక్తులు అంటున్నారు. ఇప్పటికైనా అధికారులు కల్పించుకోవాలని కోరుతున్నారు.