India: చివరిటెస్టులో దక్షిణాఫ్రికాపై టీమిండియా ఘన విజయం!
- మొదటి ఇన్నింగ్స్‌లో భారత్ 187, దక్షిణాఫ్రికా 194 పరుగులకి ఆలౌట్
- రెండో ఇన్నింగ్స్‌లో భారత్ 247, దక్షిణాఫ్రికా 177
- రెండో ఇన్నింగ్స్‌లో చివరి వరకు ఒంటరి పోరాటం చేసిన ఎల్గర్ 86 (నాటౌట్)
- 63 పరుగుల తేడాతో భారత్ విజయం
జోహన్స్‌బర్గ్‌లో జరుగుతోన్న దక్షిణాఫ్రికా, భారత్ చివరి టెస్టు మ్యాచు రెండో ఇన్నింగ్స్ లో భారత బౌలర్లు అదరగొట్టేశారు. దక్షిణాఫ్రికా వెంటవెంటనే వికెట్లు కోల్పోయింది. 241 పరుగుల విజయ లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ ఆరంభించిన సఫారీలు ఆరంభంలో రాణించినప్పటికీ, హషీమ్ ఆమ్లా (52) ఔట్ అయిన తరువాత ఇతర బ్యాట్స్మెన్లు వరసగా అవుట్ అయిపోయారు.
ఓపెనర్ ఎల్గర్ మాత్రం క్రీజులో పాతుకుపోయి 86 (నాటౌట్) పరుగులతో ఒంటరి పోరాటం చేశాడు. దక్షిణాఫ్రికా ఇతర బ్యాట్స్‌మెన్‌లో మార్క్రం 4, ఆమ్లా 52, డివిల్లియర్స్ 6, డుప్లెసిస్ 2, డికాక్ 0, ఫిలెండర్ 10, ఆండిలె 0, రబాడా 0, మార్కెల్ 0, ఎన్గిడీ 4 పరుగులు చేశారు.
దీంతో టీమిండియా 63 పరుగుల తేడాతో విజయ దుందుభి మోగించింది. టీమిండియా బౌలర్లలో షమీ 5 వికెట్లు తీయగా, బుమ్రా, ఇషాంత్ శర్మలకి రెండేసి వికెట్లు, భువనేశ్వర్ కుమార్‌కి ఒక వికెట్ దక్కాయి. కాగా, మొదటి ఇన్నింగ్స్‌లో భారత్ 187 పరుగులకి ఆలౌట్ కాగా, దక్షిణాఫ్రికా 194 పరుగులకి ఆలౌట్ అయిన విషయం తెలిసిందే. రెండో ఇన్నింగ్స్‌లో టీమిండియా 247 పరుగులు చేయగా, దక్షిణాఫ్రికా 177 పరుగులకి ఆలౌట్ అయింది. కాగా, మూడు టెస్టుల సిరీస్‌లో మొదటి రెండు టెస్టులను దక్షిణాఫ్రికా గెలుచుకున్న విషయం తెలిసిందే. దీంతో ఈ సిరీస్‌ను దక్షిణాఫ్రికా 2-1 తేడాతో కైవసం చేసుకుంది.