Tamilnadu: అమ్మాయి పేరుతో అబ్బాయి ఛాటింగ్.. మరో అబ్బాయిని ప్రేమలో దింపి, చివరకు హత్యకు గురైన వైనం!
- హత్యకు దారితీసిన ఫేస్ బుక్ లవ్
- అమ్మాయి పేరుతో ఫేక్ అకౌంట్ ఓపెన్ చేసిన కుర్రాడు
- కానిస్టేబుల్ ను ఏమార్చిన వైనం
- కిరాతకంగా హతమార్చిన కణ్ణన్ స్నేహితులు
ఫేస్ బుక్ లో పరిచయం దారుణమైన హత్యకు దారితీసిన ఘటన తమిళనాడులో చోటు చేసుకుంది. దాని వివరాల్లోకి వెళ్తే... ఎన్నూర్ పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ గా పనిచేస్తున్న కణ్ణన్ కుమార్ (32) కు కొన్నాళ్ల కిందట ఫేస్ బుక్ లో ఒక అమ్మాయి పరిచయమైంది. పరిచయం మరింత పెరగడంతో ఇద్దరూ ఫోన్ నంబర్లు ఇచ్చిపుచ్చుకున్నారు. ఇది మరింత దూరం వెళ్లడంతో ప్రేమికులయ్యారు.
దీనికి తోడు కణ్ణన్ సొంతూరు (వథిరాయిరుప్పు), ప్రియురాలి ఊరి ((పుదుపట్టికి) కి మధ్యదూరం కేవలం 5 కిలోమీటర్లే కావడంతో ఆమెను కలిసేందుకు పొంగల్ కి కణ్ణన్ ఊరెళ్లాడు. అన్నాళ్లు ప్రేమగా మాట్లాడిన ఆమె కలిసేందుకు మాత్రం అంగీకరించలేదు. దీంతో తీవ్రంగా ఆలోచించిన కణ్ణన్ తాను మోసపోయినట్టు గుర్తించాడు. దీంతో తీవ్ర ఒత్తిడికి గురై, పురుగుల మందుతాగి ఆత్మహత్యాయత్నం చేశాడు.
ఆసుపత్రిలో ఉన్న కణ్ణన్ ను కలిసిన స్నేహితులు జరిగిందంతా విని ఆశ్చర్యపోయారు. ప్రతీకారం తీర్చుకుంటామని శపథం చేశారు. యువతి పేరుతో ఇన్నాళ్లు ఫేక్ అకౌంట్ రన్ చేసిన వ్యక్తి పేరు అయ్యనార్ అని గుర్తించారు. ఎడ్యుకేషనల్ కోర్సు చదువుతోన్న అయ్యనార్ ఉద్దేశపూర్వకంగానే కణ్ణన్ ను లక్ష్యంగా చేసుకుని, అమ్మాయి పేరుతో ఛాట్ చేశాడని నిర్ధారించుకున్నారు. కణ్ణన్ ను ఏమార్చి, అతని నుంచి పెద్ద మొత్తంలో డబ్బు గుంజాడని తెలుసుకున్నారు.
దీంతో ప్లాన్ చేసిన విజయ్ కుమార్, తజింగ్, తమిళరసన్ లు అయ్యనార్ ను ఏకాంత ప్రదేశానికి రప్పించి కిరాతకంగా హత్యచేశారు. ఈ కేసును దర్యాప్తు చేసిన పోలీసులు, హత్యకేసును ఛేదించి, నిందితులు ముగ్గుర్నీ అరెస్టు చేసి, విచారించగా, వారు హత్య చేసినట్టు అంగీకరించారు. దీంతో అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన కణ్ణన్ కోసం పోలీసులు గాలిస్తున్నారు.