rgv: 'జీఎస్టీ'ని పొగుడుతూ మహిళలు మెసేజ్ లు ఇస్తున్నారంటున్న వర్మ!
- జీఎస్టీ చిత్రానికి రివ్యూలు ఇస్తున్న మహిళలు
- ట్వీట్ల ద్వారా వెల్లడించిన వర్మ
- బూతు సినిమా కాదంటున్న మహిళలు
మహిళా సంఘాలు కేసులు పెట్టినా, ఎదురు చెప్పినా, సమాజం నుంచి బహిష్కరిస్తామని హెచ్చరించినా.. దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తన పని తాను చేసుకుంటూ పోయాడు. ఎట్టకేలకు 'గాడ్, సెక్స్ అండ్ ట్రూత్' (జీఎస్టీ) సినిమాను విమియో వెబ్సైట్లో విడుదల చేశాడు. 3 డాలర్లు చెల్లించి ఇప్పటికే చాలా మంది ఈ సినిమాను చూశారు. వారిలో మహిళలు కూడా ఉన్నారు. కానీ వెరైటీగా సినిమాను పొగుడుతూ వారు రివ్యూ ఇస్తుండటం విశేషం.
సినిమా చూసి మహిళలు తనకు చేసిన మెసేజ్‌లను వర్మ ట్విట్టర్ ద్వారా పంచుకున్నారు. 'సినిమాలో ప్రతి సన్నివేశం నాకు వణుకు తెప్పించింది. అది బూతు సినిమా కాదు.. ఫిలాసఫీ కూడా కాదు... మహిళ శరీరాన్ని, శృంగారాన్ని పవిత్రమైన పద్ధతిలో ఆరాధించడం. ఈ సినిమాను ప్రతి మహిళ శిరోధార్యంగా భావించాలి' అని మహిళ మెసేజ్ చేసిందని వర్మ పేర్కొన్నారు.
ఇంకో మహిళ చేసిన మెసేజ్‌ను కూడా వర్మ ట్వీట్ చేశారు. 'ఓ బాలికగా సామాజిక నియమాలు, నైతిక విలువల వల్ల నేను అణచివేతకు గురయ్యాను. కానీ జీఎస్టీ చూసిన తర్వాత దేవుడు నన్ను మహిళగా పుట్టించినందుకు గర్వపడుతున్నాను. మహిళ శృంగార స్వేచ్ఛ గురించి చెప్పిన విధానం నాకు నచ్చింది. నా శృంగార హక్కుల గురించి ఆలోచించేలా చేసింది. వర్మకి, మియా మాల్కోవాకి ధన్యవాదాలు' అని ఆమె మెసేజ్‌లో ఉన్నట్లు వర్మ తెలిపారు.