Tapsee: నాకు తెలియకుండా ఆ హీరో నా ఇంట్రడక్షన్ సీన్ మార్చేశాడు!: తాప్సీ
- తన కోసం ఏడాది పాటు ఎదురుచూశారట
- లాభాల నుంచి కోటి రూపాయలు ఇచ్చారన్న తాప్సీ
- అలాంటి వారితో ఇక పనిచేయదట!
సాధారణంగా సినిమా తారలు తమ పారితోషికాల వివరాలు వెల్లడించడానికి నిరాకరిస్తారు. చెప్పినదాకా వుండి ఐటీ వాళ్లతో లేనిపోని తలనొప్పులు వస్తాయని ఆ పారితోషికాల విషయాలు చెప్పరు. అయితే, తాజాగా సొట్టబుగ్గల చిన్నది తాప్సీ మాత్రం 'ఆనందో బ్రహ్మ' సినిమాకి కోటి రూపాయలు తీసుకున్నానని చెప్పేసింది. "ఆ కథకి నేనే కావాలని చెప్పి, నా కోసం ఏడాది పాటు ఆ చిత్రం యూనిట్ ఎదురుచూసింది. అందుకే, కాదనలేక ఆ సినిమా చేశాను. పైగా నాకు ఎంతో గౌరవం కూడా ఇచ్చారు. అంతేకాదు, ఆ సినిమా లాభాల నుంచి కోటి రూపాయలు ఇచ్చారు" అని చెప్పింది తాప్సీ .
ఆర్టిస్టుగా తనకు గౌరవం ఇచ్చే వారితోనూ, తన పాత్రకు ప్రాధాన్యత ఇచ్చేవారితోను నటించడానికి తాను ఇష్టపడతానని తాప్సీ చెప్పింది. గతంలో ఓ తెలుగు సినిమా విషయంలో ఎదురైన చేదు అనుభవమే ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణమని ఆమె చెప్పింది.
ఆ అనుభవం గురించి వివరిస్తూ, 'నాకు ముందుగా కథ చెప్పినప్పుడు ఆ సినిమాలో నా ఇంట్రడక్షన్ సీన్ వేరేలా వుంది. తీరా షూటింగుకి వెళ్లాక మరోలా తీశారు. ఇదేమిటని దర్శకుడిని అడిగితే, హీరో మార్చమన్నారని చెప్పారు. ఆ సంఘటన నన్ను చాలా బాధించింది. మనకు గౌరవం, విలువ ఇచ్చే వాళ్లతోనే పనిచేయాలని అప్పుడే నిర్ణయించుకున్నాను' అని చెప్పింది తాప్సీ. అయితే, ఆ సినిమా గురించి కానీ, హీరో గురించి కానీ అమ్మడు ఏ వివరాలు చెప్పలేదు.