Pawan Kalyan: పవన్ కల్యాణ్ ది భజనపార్టీ అని అప్పుడు మీకు తెలియలేదా?: తమ్మారెడ్డి భరద్వాజ

  • పవన్ కల్యాణ్ ని ‘ఫోర్స్’గా భావించి నాడు ఇంటింటికీ తీసుకెళ్లారు
  • ఈరోజునా ‘ఫోర్స్’గానే భావించి భయపడిపోతున్నారు
  • జాతీయపార్టీల తీరుపై మండిపడ్డ తమ్మారెడ్డి

తెలంగాణలో జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ మూడు రోజుల యాత్ర నిన్నటితో ముగిసిన విషయం తెలిసిందే. పవన్ కల్యాణ్ తన యాత్రను ఈ నెల 22న ప్రారంభించి 24 వ తేదీతో ముగించారు. అయితే, పవన్ తన యాత్ర ప్రారంభించిన రోజు నుంచే భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీల నేతలు ఆయనపై విమర్శలు గుప్పించారు.

 ఈ విషయాన్ని ‘నా ఆలోచన’ ద్వారా ప్రముఖ దర్శక-నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ ప్రశ్నించారు. పవన్ తన యాత్ర ప్రారంభించిన రోజు నుంచే జాతీయ పార్టీలు, ఎవరైతే ఆయన వెనుక తిరిగారో వారే విలేకరుల సమావేశాలు నిర్వహించి ‘భజనపార్టీ’ అని విమర్శించారని అన్నారు. కనీసం ఆయన ఏం మాట్లాడతాడో కూడా వినకుండా ఇటువంటి వ్యాఖ్యలు చేశారని విమర్శించారు.

‘2014 ఎన్నికలప్పుడు, పవన్ మీకు మద్దతు ఇచ్చినప్పుడు ఆయనది భజనపార్టీ కాదా? ఆరోజు ఆయన అవసరం ఉంది కనుక, ఆయన్ని ఇంటింటీకి తీసుకెళ్లారే! అప్పుడు తెలియలేదా ఆయనది భజనపార్టీ అని? ఆ రోజున పవన్ కల్యాణ్ గారిని ‘ఫోర్స్’ అని అనుకున్నారు కనుక తీసుకెళ్లారు. ఈరోజునా ఆయన్ని ‘ఫోర్స్’ అనే అనుకుంటున్నారు కాబట్టి భయపడిపోయి ఆయన పార్టీని ‘భజనపార్టీ’ అని అంటున్నారు.

కాంగ్రెస్ పార్టీ వాళ్లు కూడా ఆయన్ని విమర్శించారు. జాతీయ పార్టీల నేతలు ఇంత చౌకబారు వ్యాఖ్యలు చేయాల్సిన అవసరం ఉందా? ఒక మనిషిని లక్ష్యంగా చేసుకుంటే ఏమొస్తుంది? ఇందులో ఏమన్నా అర్థముందా? దేశాన్ని గురించి ఆలోచించడం మానేశారా? కేవలం మాటల ద్వారా వేధించడం (ట్రాలింగ్), వార్తల్లోకెక్కాలనే ఉద్దేశంతోనే పవన్ పై విమర్శలు చేస్తున్నారా? దేశానికి ఏం చేద్దామనే ఆలోచనను విడిచిపెట్టి, ఎవరి మీద రాయి వేద్దాం, విమర్శలు చేద్దామనే ఆలోచనలను జాతీయ పార్టీల నేతలు మానుకోవాలి’ అని తమ్మారెడ్డి భరద్వాజ సూచించారు.

  • Loading...

More Telugu News