jio offers: జియో మాస్ ప్లాన్ తో ఐడియా, ఎయిర్ టెల్ కు ముచ్చెమటలే!
- 28 రోజుల వ్యాలిడిటీతో రూ.98 ప్లాన్
- దీనివల్ల పోటీ సంస్థలకు నష్టాలు పెరిగే ప్రమాదం
- మరింత మంది కస్టమర్లకు గురిపెట్టిన జియో
అతి తక్కువ ధరలకే 4జీ డేటా సేవలతో టెలికం రంగంలో సంచలనం సృష్టించి, ఈ రంగంలో అప్పటికే ఉన్న కంపెనీలను కుదిపేసిన రిలయన్స్ జియో మరోసారి ధరల యుద్ధానికి తెరతీసింది. జియో తాజాగా ప్రకటించిన రూ.98 ప్లాన్ ను ఇందుకు ఉదాహరణగా విశ్లేషకులుగా పేర్కొంటున్నారు. రూ.98 ప్లాన్ పై యూజర్లు అన్ లిమిటెడ్ కాలింగ్ తో పాటు ప్రతీ నెలా 2జీబీ డేటా అందుకుంటారు. వ్యాలిడిటీ 28 రోజులు. మరింత మంది కస్టమర్లను సంపాదించేందుకు రిలయన్స్ జియో ఈ ప్లాన్ ను తీసుకొచ్చింది. ఈ ప్లాన్ తో సగటున ఓ యూజర్ నుంచి వచ్చే ఆదాయం (ఏఆర్ పీయూ) మరింత తగ్గుతుందని జేపీ మోర్గాన్ అంటోంది. జియో తక్షణ లక్ష్యం మాస్ విభాగాన్ని ఆకర్షించడమేనని అభిప్రాయం వ్యక్తం చేసింది. జియో 98 ప్లాన్ అర్థవంతమైన ప్లాన్ అని క్రెడిట్ సూసే పేర్కొంది. దీనివల్ల పోటీ సంస్థలకు మరిన్ని నష్టాలు, ఆర్థిక సమస్యలు ఎదురవుతాయని అంచనా వేసింది.