smart phone: మూడింట ఒక స్మార్ట్‌ఫోన్‌కి గుడ్ మార్నింగ్ మెసేజ్‌ల బెడద... భారత్‌లో మరీ ఘోరం!
- ఫొటోలు, వీడియోలతో నిండిపోతున్న మెమొరీ
- ఖాళీ చేసుకోవడానికి ఇబ్బంది పడుతున్న వినియోగదారులు
- అలాంటి మెసేజ్‌లను కట్టడి చేసే ప్రయత్నం చేస్తున్న గూగుల్
పొద్దున్న లేచి వాట్సాప్, ఫేస్బుక్ చూడగానే పదుల సంఖ్యలో గుడ్ మార్నింగ్ మెసేజ్‌లు ఉంటాయి. కొంచెం క్రియేటివ్‌గా గుడ్ మార్నింగ్ చెప్పడం కోసం ఫొటోలు, వీడియోలు జతచేసి మెసేజ్‌లు పెడుతుంటారు. ఇలాంటి మెసేజ్‌లు ఒకరోజులో మిలియన్ల కొద్దీ వెళుతున్నాయని, దీంతో ఫోన్ స్టోరేజీతో పాటు క్లౌడ్ స్టోరేజీలో కూడా మెమొరీ సరిపోవడం లేదని గూగుల్ ప్రోడక్ట్ మేనేజర్ జోష్ వుడ్వార్డ్ అంటున్నారు. భారతదేశంలోని ప్రతి మూడు స్మార్ట్ఫోన్లలో ఒక ఫోన్ ఈ గుడ్ మార్నింగ్ మెసేజ్‌ల కారణంగా స్టోరేజీ సమస్యలు ఎదుర్కుంటుందని, అమెరికాలో ప్రతి పది ఫోన్లలో ఒకటి ఈ సమస్య ఎదుర్కుంటోందని ఆయన తెలిపారు.
మెమొరీ క్లియర్ చేసుకోవడానికి వినియోగదారులు ఇబ్బంది పడుతున్నారని, వారి సౌకర్యార్థం ఫైల్స్ గో యాప్‌ను విడుదల చేసినప్పటికీ పెద్దగా ఉపయోగించడం లేదని వుడ్వార్డ్ అన్నారు. త్వరలోనే ఈ గుడ్ మార్నింగ్ మెసేజ్‌ల పేరుతో పంపే చిత్రాలు, వీడియోలను కట్టడి చేయడానికి, వీలైతే తొలగించడానికి ఓ ఆల్గారిథమ్ను కూడా తయారుచేయబోతున్నట్లు వుడ్వార్డ్ చెప్పారు. గుడ్ మార్నింగ్ ఫొటోలు, వీడియోల కోసం గూగుల్‌లో సెర్చ్ చేసే వారి సంఖ్య గత ఐదేళ్లలో పది రెట్లు పెరిగిందని, ఇక తక్కువ ధరకు 4జీ ఇంటర్నెట్ సదుపాయం ఉండటంతో అది మరింత పెరిగినట్లు తెలుస్తోంది.