Congress: రాష్ట్రంలో అక్రమ అరెస్టులను ఖండిస్తున్నాం: ఏపీసీసీ అధ్యక్షుడు ర‌ఘువీరారెడ్డి

  • గొట్టిపాడులో ఇటీవల దళితులు, అగ్రవర్ణాల ప్రజల మధ్య ఘర్షణ
  • చలో గొట్టిపాడుకు పిలుపునిచ్చిన ప్రతిపక్ష పార్టీలు
  • దళిత, వామపక్ష, ప్రజా సంఘాల నాయకులను పోలీసులు అక్రమంగా అరెస్టు చేశారు-రఘువీరారెడ్డి
  • రాష్ట్రంలో నిరంకుశ పాల‌న సాగుతోంది

గుంటూరు జిల్లా గొట్టిపాడులో దళితులు, అగ్రవర్ణాల ప్రజల మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. అగ్రకులాల తీరుకి నిరసనగా ఈ రోజు సీపీఎం చలో గొట్టిపాడుకు పిలుపునిచ్చింది. అయితే, గొట్టిపాడులో 144 సెక్షన్, 30 యాక్ట్ అమల్లో ఉందని పేర్కొంటూ పలువురు నాయకులను పోలీసులు అరెస్టు చేసినట్లు తెలిసింది. కాగా, ఈ ఘటనపై ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి మండిపడ్డారు. రాష్ట్రంలో సాగుతున్నది ప్ర‌జాస్వామ్య పాల‌నా? లేక నిరంకుశ‌పాల‌నా? అని ఆయన ప్ర‌శ్నించారు.

చలో గొట్టిపాడు సందర్భంగా బాధితులను పరామర్శించడానికి వెళుతోన్న దళిత, వామపక్ష, ప్రజా సంఘాల నాయకులను పోలీసులు అక్రమంగా అరెస్టు చేయడాన్ని ఖండిస్తున్నట్లు తెలిపారు. గొట్టిపాడులో దళితులపై దాడి చేసిన వారిని శిక్షించకపోవడమే కాకుండా, పరామర్శించడానికి వెళుతోన్న నాయకులను అరెస్ట్ చేయడం దారుణమన్నారు.

 అరెస్ట్ అయిన వారిలో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఎస్సీ సెల్ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు కొరివి వినయ్‌కుమార్, వైకే శాంతకుమార్, మేళం భాగ్యరావు, దళిత, వామపక్ష, ప్రజా సంఘాల నాయకులు ఉన్నారని చెప్పారు. అక్రమంగా అరెస్టు చేసిన వారిని బేషరతుగా విడుదల చేయాలని, దళితులకు రక్షణ కల్పించాలని రఘువీరారెడ్డి డిమాండ్ చేశారు. 

  • Loading...

More Telugu News