cpm: సీపీఎం నేత మధు అరెస్ట్.. ఖండించిన రఘువీరారెడ్డి!
- గుంటూరు జిల్లాలోని పెదగొట్టిపాడులో ఉద్రిక్త పరిస్థితులు
- ఇటీవల దళితులకు, అగ్రకులస్తులకు మధ్య గొడవ
- పెదగొట్టిపాడును సందర్శించాలనుకున్న మధు, సీపీఎం నేతలు
- బేషరతుగా విడుదల చేయాలి: రఘువీరా రెడ్డి
గుంటూరు జిల్లాలోని పెదగొట్టిపాడులో ఈనెల ఒకటో తేదీన తమపై అగ్రకులాల వారు దాడి చేశారంటూ దళితులు ఆందోళన నిర్వహిస్తున్నారు. దీంతో గత కొన్ని రోజులుగా ఆ గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ఈ రోజు ప్రజా సంఘాలతో కలిసి సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు ఆ గ్రామాన్ని సందర్శించాలనుకున్నారు. అయితే, మధుతో పాటు సీపీఎం నేతలు ఎవరూ ఆ గ్రామంలోకి రాకుండా పోలీసులు ముందస్తు అరెస్టులు చేపట్టారు. అనంతరం వారిని పోలీసులు తాడేపల్లి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
కాగా, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధును పోలీసులు అక్రమంగా అరెస్టు చేశారని, పోలీసుల చర్యను ఖండిస్తున్నామని ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి అన్నారు. ఈ మేరకు విజయవాడలోని ఏపీసీసీ కార్యాలయం నుంచి ఓ ప్రకటన విడుదల చేశారు. గుంటూరు జిల్లా వ్యాప్తంగా పలువురు నేతలను పోలీసులు అక్రమంగా అరెస్టు చేశారని, వారిని బేషరతుగా విడుదల చేయాలని రఘువీరారెడ్డి డిమాండ్ చేశారు.