padmavat: 'పద్మావత్' విషయంలో రాజస్థాన్, మధ్యప్రదేశ్ ప్రభుత్వాలకు చుక్కెదురు
- పునరాలోచన చేయాలన్న పిటిషన్ ను కొట్టివేసిన సుప్రీంకోర్టు
- పాత ఆదేశాలనే పాటించాలని ఆదేశం
- సినిమాను కచ్చితంగా విడుదల చేయాలన్న ధర్మాసనం
'పద్మావత్' చిత్రం విడుదల విషయంలో ఇచ్చిన తీర్పును పునరాలోచించాలని కోరుతూ మధ్యప్రదేశ్, రాజస్థాన్ ప్రభుత్వాలు సుప్రీం కోర్టులో పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. దీనిపై ఇవాళ విచారణ చేపట్టిన అత్యున్నత న్యాయస్థానం ఆయా రాష్ట్రాల విన్నపాన్ని కొట్టిపారేసింది. శాంతి భద్రతల సమస్యల దృష్ట్యా సినిమా విడుదలను అడ్డుకోవడం సబబు కాదని, పాత ఆదేశాల్లో ఎలాంటి మార్పులు చేయబోమని పేర్కొంది. కావాలంటే సినిమా చూడొద్దని ప్రజలకు చెప్పుకోండి కానీ, విడుదలను అడ్డుకునే హక్కు లేదని కర్నిసేన, మధ్యప్రదేశ్, రాజస్థాన్ ప్రభుత్వాలకు సుప్రీం కోర్టు సలహా ఇచ్చింది.
దీంతో విడుదలను అడ్డుకోవడానికి ఆయా రాష్ట్రాలకు న్యాయపరంగా ఎలాంటి మద్దతు లభించకుండా పోయింది. మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లతో పాటు గుజరాత్, హర్యానాలు కూడా ఈ సినిమా విడుదలపై నిషేధం విధించిన సంగతి తెలిసిందే. గురువారం విడుదల కాబోతున్న ఈ చిత్రం గురించి ఇప్పటికే థియేటర్ యాజమాన్యాలకు హెచ్చరికలు కూడా వెళ్తున్నాయి. సినిమాను ప్రదర్శిస్తే థియేటర్లు తగలబెడతామని, ఉద్రిక్త పరిస్థితులు సృష్టిస్తామని రాజ్‌పుత్, కర్ని సేనలు హెచ్చరిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వాలు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటాయో మరి!