whtsapp: వాట్సాప్ బాటలో పేటీఎం... బిజినెస్ కోసం ప్రత్యేక యాప్
- చిన్న, మధ్యస్థ వ్యాపారులకు సౌలభ్యం
- పది స్థానిక భాషల్లో లభ్యం
- ఎలాంటి కమీషన్ లేకుండా బ్యాంకుకి ట్రాన్స్‌ఫర్
ఇటీవల సమాచార సరఫరా యాప్ వాట్సాప్...కొత్తగా వ్యాపార లావాదేవీల కోసం ప్రత్యేకంగా వాట్సాప్ బిజినెస్ యాప్‌ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అదే బాటలో ఆన్‌లైన్ పేమెంట్ల దిగ్గజం పేటీఎం కూడా పయనించింది. చిన్న, మధ్యస్థ వ్యాపారులకు సౌలభ్యంగా ఉండటం కోసం `పేటీఎం ఫర్ బిజినెస్` యాప్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ యాప్ గూగుల్ ప్లే స్టోర్‌లో డౌన్‌లోడ్‌కి సిద్ధంగా ఉంది. పది స్థానిక భారతీయ భాషల్లో ఈ యాప్ లభ్యమవుతోంది.
ఈ యాప్ ద్వారా వ్యాపారులు తమ లావాదేవీలను చేసుకోవచ్చు. అంతేకాకుండా పేటీఎంలో డబ్బును ఎలాంటి అదనపు రుసుము చెల్లించకుండానే బ్యాంక్ ఖాతాకు ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు. రూ. 50,000 వరకు పేటీఎంలో డబ్బు లావాదేవీలు చేసుకోవచ్చు. ప్రత్యేక అనుమతి ద్వారా అంత కంటే ఎక్కువ డబ్బు లావాదేవీలు కూడా చేసుకోవచ్చు. క్యూఆర్ కోడ్, వారం, నెలసరి, వార్షిక స్టేట్‌మెంట్లు పొందవచ్చు. ఫోన్ నెంబర్‌కి వచ్చే ఓటీపీ ద్వారా లావాదేవీలను కన్‌ఫర్మ్ చేయవచ్చు. సందేహాల కోసం ప్రత్యేక హెల్ప్‌డెస్క్‌ని కూడా పేటీఎం అందుబాటులో ఉంచింది.