oneplus: వన్ ప్లస్ స్మార్ట్ ఫోన్ కంపెనీ వెబ్ సైట్ పై హ్యాకర్ల దాడి... కస్టమర్ల కీలక సమాచారానికి ముప్పు
- క్రెడిట్ కార్డుల సమాచారం చోరీ
- పలు కస్టమర్ల కార్డులపై మోసపూరిత లావాదేవీలు
- ధ్రువీకరించిన వన్ ప్లస్
వన్ ప్లస్ స్మార్ట్ ఫోన్ కస్టమర్ల కీలక సమాచారానికి ముప్పు ఏర్పడింది. కంపెనీ అధికారిక వెబ్ సైట్ పై హ్యాకింగ్ దాడి జరిగింది. కంపెనీ పోర్టల్ నుంచి కొనుగోళ్లు చేసిన కస్టమర్లలో కొందరు, తమ క్రెడిట్ కార్డుల ద్వారా మోసపూరిత లావాదేవీలు జరిగాయంటూ ఫిర్యాదులు చేయడంతో విషయం బయటకు వచ్చింది. వన్ ప్లస్ ఫోరమ్ లో ఈ వివరాలను కంపెనీ ఉద్యోగి ఒకరు వెల్లడించారు. హ్యాకింగ్ దాడి అనుమానంతో చైనాకు చెందిన ఈ సంస్థ దర్యాప్తు నిర్వహించింది. కంపెనీ పేమెంట్ పేజీలో ఓ కోడ్ ను చొప్పించడం ద్వారా మోసపూరిత లావాదేవీలు జరిగినట్టు గుర్తించారు.
‘‘మా సిస్టమ్స్ లో ఒకదానిపై దాడి జరిగింది. పేమెంట్ పేజీలో మాలీషియస్ స్క్రిప్ట్ ను ప్రవేశపెట్టి, క్రెడిట్ కార్డుల సమాచారం దొంగిలించారు. కస్టమర్ల బ్రౌజర్ల నుంచే డేటాను పంపించడం జరిగింది. దీన్ని తొలగించాం’’ అని కంపెనీ ఫోరమ్ ప్రకటనను పోస్ట్ చేశారు. వన్ ప్లస్ డాట్ నెట్ పై గతేడాది నవంబర్ మధ్య నుంచి ఈ ఏడాది జనవరి 11 మధ్య లావాదేవీలు నిర్వహించిన వారి క్రెడిట్ కార్డుల నంబర్లు, ఎక్స్ పయిరీ తేదీలు చోరీకి గురై ఉండొచ్చని కంపెనీ సందేహం వ్యక్తం చేసింది.