irfan khan: క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ కి ఫిల్మ్‌ఫేర్ అవార్డు... ట్వీట్‌లో పొరపాటు చేసిన ఫెమినా ఇండియా!
- ఇర్ఫాన్ ఖాన్‌కి బదులుగా పఠాన్‌ని ట్యాగ్ చేసిన వైనం
- 'నేను వేడుకకు రాలేకపోయాను.. అవార్డు ఇంటికి పంపండి' అని ఫన్నీ ట్వీట్ చేసిన క్రికెటర్
- ట్విట్టర్‌లో నవ్వులు పూయిస్తున్న తప్పిదం
ఫిల్మ్‌ఫేర్ అవార్డుల్లో క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్‌కి ఉత్తమ నటుడి అవార్డు వచ్చింది... అవును.. ఫెమినా ఇండియా మేగజైన్ వారి ట్వీట్ తప్పిదం ప్రకారం ఇర్ఫాన్ పఠాన్‌కి అవార్డు ఇవ్వాలని నెటిజన్లు కోరుతున్నారు. 63వ ఫిల్మ్‌ఫేర్ అవార్డుల్లో హిందీ మీడియం సినిమాకు గాను బాలీవుడ్ నటుడు ఇర్ఫాన్ ఖాన్ ఉత్తమ నటుడిగా అవార్డు అందుకున్నారు. అయితే ఆయనకు కృతజ్ఞతలు చెబుతూ ఫెమినా ఇండియా చేసిన ట్వీట్‌లో ఇర్ఫాన్ ఖాన్‌కి బదులుగా ఇర్ఫాన్ పఠాన్‌ని ట్యాగ్ చేయడంతో ఈ గందరగోళం ప్రారంభమైంది.
అది సరిపోదన్నట్లు స్వయంగా ఇర్ఫాన్ పఠాన్ వారి ట్వీట్‌కి రిప్లై ఇవ్వడంతో నెటిజన్లు నవ్వు పుట్టించే కామెంట్లు చేస్తున్నారు. 'నేను వేడుకకు రాలేక పోయాను... నా అవార్డును మా ఇంటికి పంపండి' అని పఠాన్ ఫన్నీ ట్వీట్ చేశారు. దీనిపై నెటిజన్లు స్పందిస్తూ... 'ఈ కేసును సీబీఐకి అప్పగించాలి', 'మరి యూసుఫ్ పఠాన్‌కి ఏ అవార్డు వచ్చింది?', 'క్రికెట్ ఆడిన వారికి కూడా ఫిల్మ్‌ఫేర్ అవార్డులు ఇస్తారా?' అంటూ కామెంట్లు చేశారు. ఈ ట్వీట్‌ను ఫెమినా వారు ఇంకా మార్పు చేయకపోవడం గమనార్హం.