team india: టీమిండియాను వైట్ వాష్ చేస్తాం: సఫారీ పేసర్ రబడా

  • టీమిండియాను 3-0తో వైట్ వాష్ చేస్తాం
  • వాండరర్స్ పిచ్ పేస్, బౌన్స్, స్వింగ్ కు స్వర్గధామం
  • టీమిండియా ఎలా సన్నద్ధమైనా వారిని ఓడించడమే లక్ష్యం

టెస్టు సిరీస్ లో టీమిండియాను 3-0తో వైట్‌ వాష్‌ చేస్తామని సఫారీ పేసర్ కాసోగీ రబడా తెలిపాడు. జనవరి 24 నుంచి జొహాన్నెస్ బర్గ్ వేదికగా మూడో టెస్ట్ ఆరంభం కానుంది. ఈ  నేపథ్యంలో సఫారీల ప్రధాన పేసర్ గా భూమిక పోషిస్తున్న కాసోగి రబడ మాట్లాడుతూ, మ్యాచ్‌ ఏదైనా గెలుపే ప్రధానమని అన్నాడు. అందుకే చివరి టెస్టును కూడా సొంతం చేసుకుని టీమిండియాను వైట్‌ వాష్‌ చేయాలనుకుంటున్నామని తెలిపాడు. చివరి టెస్టు జరిగే జొహాన్నెస్ బర్గ్ లోని వాండరర్స్ పిచ్‌... పేస్‌, బౌన్స్‌, స్వింగ్‌ కు స్వర్గధామమని అన్నాడు.

తమ జట్టు బ్యాటింగ్ లో ఒకరిద్దరు ప్రధాన ఆటగాళ్లపై ఆధారపడినట్లే టీమిండియా కేవలం కెప్టెన్‌ కోహ్లీపైనే ఆధారపడుతోందని రబడా పేర్కొన్నాడు. అలా అని టీమిండియాలో నాణ్యమైన ఆటగాళ్లు లేరని అర్థం కాదని చెబుతూనే, టీమిండియాలో ఇతర ఆటగాళ్లందరి కంటే విరాట్‌ మాత్రమే ఎక్కువ పరుగులు సాధిస్తున్నాడన్నది వాస్తవమని గుర్తు చేశాడు. అలాంటి బ్యాట్స్‌ మెన్‌ కు బౌలింగ్‌ చేయడాన్ని ఆస్వాదిస్తున్నానని రబడా చెప్పాడు. చివరి టెస్టుకు భారత్‌ సన్నాహకం ఎలా ఉందన్నది తమకు సంబంధం లేని విషయమని స్పష్టం చేశాడు. ఆ జట్టు సన్నద్ధత ఎలా ఉన్నప్పటికీ ఆ జట్టుపై విజయం సాధించడమే తమకు ముఖ్యమని రబడా స్పష్టంగా చెప్పాడు. తొలి రెండు టెస్టుల్లో సఫారీ బౌలర్ల బంతులకు టీమిండియా బ్యాట్స్ మన్ నిలబడలేకపోయిన సంగతి తెలిసిందే. 

team india
south africa
Cricket
3rd test
  • Loading...

More Telugu News