Andhra Pradesh: ఏపీ ఐటీ శాఖ, కోవలెంట్ ఫండ్ కు మధ్య కుదిరిన ఒప్పందం
- కోవలెంట్ ఫండ్ ద్వారా యువతకు శిక్షణ, ఉద్యోగావకాశాలు
- 2019 లోపు ఐదువేల మంది విద్యార్థులకు ఉద్యోగాలు
- బ్లాక్ చైన్ టెక్నాలజీ యూనివర్శిటీ ఏర్పాటు ఒప్పంద లక్ష్యం
- ఆర్టీజీ అమలు గురించి కోవలెంట్ ఫండ్ ప్రతినిధులకు వివరించిన లోకేశ్
ఏపీ ఐటీ శాఖ, కోవలెంట్ ఫండ్ మధ్య ఈరోజు ఒప్పందం కుదిరింది. ఏపీ సచివాలయంలో ఏర్పాటు చేసిన రియల్ టైం గవర్నెన్స్ సెంటర్ (ఆర్టీజీఎస్) కు కోవలెంట్ ఫండ్ ప్రతినిధులను లోకేశ్ తీసుకుని వెళ్లారు. రాష్ట్రంలో అమలు చేస్తున్న ఆర్టీజీ గురించి వారికి వివరించి చెప్పారు. అనంతరం, లోకేశ్ మాట్లాడుతూ, ప్రపంచ వ్యాప్తంగా బ్లాక్ చైన్ టెక్నాలజీ అభివృద్ధి చెందుతోందని, ఈ టెక్నాలజీలో రాష్ట్ర యువతకు కోవలెంట్ ఫండ్ ద్వారా శిక్షణ కల్పించి, ఉద్యోగాలు చేసేలా చెయ్యడమే ఈ ఒప్పందం లక్ష్యమని చెప్పారు.
ఈ టెక్నాలజీలో యువత ఉద్యోగాలు సాధించేందుకు హ్యాకథాన్స్ నిర్వహిస్తున్నామని, 2019 లోపు ఐదువేల మంది విద్యార్థులకు ఈ టెక్నాలజీలో ఉద్యోగాలు కల్పించాలనేది లక్ష్యంగా పెట్టుకున్నట్టు వివరించారు. ‘బ్లాక్ చైన్ టార్గెట్ -2019’లో భాగంగా బ్లాక్ చైన్ టెక్నాలజీ యూనివర్శిటీ ఏర్పాటుకు ఈ ఒప్పందం ఉపయోగపడుతుందని అన్నారు. స్టార్టప్ కంపెనీలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం రూ.100 కోట్లు కేటాయించిందని, రాష్ట్ర ప్రజలకు మెరుగైన సేవలు, సంక్షేమ కార్యక్రమాలు అందించేందుకు, వారి సమస్యలు తెలుసుకుని పరిష్కరించేందుకు టెక్నాలజీని పెద్ద ఎత్తున వినియోగిస్తున్నామని అన్నారు.
సీఎం కోర్ డ్యాష్ బోర్డ్ ద్వారా రాష్ట్రంలో జరిగే అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాల అమలు గురించి తెలుసుకుంటున్నామని, ప్రభుత్వంలోని అన్ని శాఖలను అనుసంధానం చేస్తూ ఒకే చోట సమాచారం ఉండేలా దీనిని ఏర్పాటు చేశామని అన్నారు. టెక్నాలజీని పెద్ద ఎత్తున వినియోగిస్తున్నామని, సైబర్ ఎటాక్స్ బారిన పడకుండా ఉండేందుకు బ్లాక్ చైన్ టెక్నాలజీ ద్వారా ప్రభుత్వ సమాచారానికి రక్షణ కల్పిస్తున్నట్టు నారా లోకేశ్ చెప్పారు.