Vijay Mallya: మాల్యాకు మరో ఎదురు దెబ్బ.. కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ కేసులో అరెస్ట్ వారెంట్!
- ప్రస్తుతం బ్రిటన్‌లో తలదాచుకుంటున్న మాల్యా
- కంపెనీ చట్టాలను ఉల్లంఘించిన కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్
- మాల్యా సహా 18 మందిపై అరెస్ట్ వారెంట్లు
వేల కోట్ల రూపాయలను బ్యాంకులకు ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయిన లిక్కర్ కింగ్ విజయమాల్యాకు మరో ఎదురుదెబ్బ తగిలింది. కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ కేసులో మాల్యాకు అరెస్ట్ వారెంట్ జారీ చేయాల్సిందిగా బెంగళూరులోని ప్రత్యేక కోర్టు ఆదేశించింది. సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్ (ఎస్ఎఫ్ఐఓ) ఫిర్యాదు మేరకు న్యాయస్థానం ఈ ఆదేశాలు జారీ చేసింది.
2012లో ప్రారంభమైన కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ కంపెనీ చట్టాలను ఉల్లంఘించిందని ఎస్ఎఫ్ఐఓ కోర్టుకు తెలిపింది. కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఈ దర్యాప్తు సంస్థ పనిచేస్తుంది.
కంపెనీస్ యాక్ట్ ప్రకారం బెంగళూరులో ఏర్పాటైన ప్రత్యేక న్యాయస్థానం ఈ కేసులో మాల్యా సహా మరో 18మందికి అరెస్ట్ వారెంట్లు జారీ చేయాలని ఆదేశించింది. దాదాపు రూ.9 వేల కోట్ల రూపాయలు బ్యాంకులకు ఎగ్గొట్టిన మాల్యా ప్రస్తుతం బ్రిటన్‌లో తలదాచుకుంటున్నాడు.