south Africa: అండర్-19 ప్రపంచకప్: క్రికెట్ చరిత్రలో అరుదైన ఔట్!

  • బంతి అందుకుని ఫీల్డర్‌కు అందించినందుకు ఔట్
  • వెల్లువెత్తుతున్న విమర్శలు
  • ఇలా అవుటైన తొలి బ్యాట్స్‌మన్‌గా జివేషన్ రికార్డు

న్యూజిలాండ్‌లో జరుగుతున్న అండర్-19 ప్రపంచకప్‌లో విచిత్రమైన ఔట్ చోటుచేసుకుంది. బంతిని కీపర్‌కు అందించిన బ్యాట్స్‌మన్‌ను అంపైర్ ఔట్‌గా ప్రకటించడం ఇప్పుడు సర్వత్ర చర్చనీయాంశమైంది. విమర్శలు కూడా పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి.

దక్షిణాఫ్రికా-విండీస్ మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో 17వ ఓవర్‌లో విండీస్ బౌలర్ హోతే వేసిన బంతిని సఫారీ ఓపెనర్ జివేషన్ పిల్లే ఎదుర్కొన్నాడు. బంతి ప్యాడ్లకు తాకి కింద పడి వికెట్ల వైపు వెళ్తుండగా దానిని బ్యాట్ తో ఆపి, చేతితో అందుకున్న జివేషన్ కీపర్‌కు అందించాడు. క్రికెట్‌లో ఇది సర్వసాధారణమైన విషయం. అయితే ఐసీసీ కొత్త రూల్స్ ప్రకారం.. అలా చేయడం అవుటంటూ విండీస్ ఆటగాళ్లు జివేషన్ అవుట్ కోసం అప్పీలు చేశారు. చివరికి ఇది థర్డ్ అంపైర్‌కు చేరడంతో ఆయన ఔట్ అని ప్రకటించాడు. ఫీల్డర్ల అనుమతి లేకుండా బ్యాట్స్‌మన్ బంతిని ముట్టుకోవడం ఐసీసీ రూల్ 37.4 కిందికి వస్తుందని, కాబట్టి ఔట్ ప్రకటించినట్టు అంపైర్లు చెబుతున్నారు.

జివేషన్ అవుట్‌పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాను ఇలా కొన్ని వందలసార్లు చేశానని, అప్పుడెందుకు ఔట్ ఇవ్వలేదంటూ దక్షిణాఫ్రికా జాతీయ జట్టు కెప్టెన్ డుప్లెసిస్ ట్వీట్ చేశాడు. ఇది చాలా విచారకరమని ఆవేదన వ్యక్తం చేశాడు. కాగా, ఈ రకంగా అవుటైన తొలి బ్యాట్స్‌మన్‌గా జివేషన్ రికార్డులకెక్కాడు. 

  • Loading...

More Telugu News