U-19 World Cup Cricket: అండర్-19 వరల్డ్ కప్... భారత కుర్రోళ్ల చేతిలో చిత్తు చిత్తుగా ఓడిన పపువా న్యూ గినియా!
- తొలుత బ్యాటింగ్ చేసి 64 పరుగులకు ఆలౌటైన పపువా న్యూ గినియా
- 8 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించిన భారత యువకులు
- వరుసగా రెండో మ్యాచ్ లోనూ గెలుపు
అండర్-19 ప్రపంచకప్ లో భాగంగా మౌంట్ మౌంగానుయ్ లో పపువా న్యూ గినియాతో తలపడిన భారత జట్టు ఘన విజయాన్ని నమోదు చేసి వరుసగా రెండో గెలుపును సొంతం చేసుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన పపువా న్యూగినియా జట్టు, భారత బౌలర్ల ధాటికి చేతులెత్తేసి, 22 ఓవర్లు కూడా ఆడకుండానే 64 పరుగులకు ఆలౌట్ అయింది.
ఆపై 65 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టు, 8 ఓవర్లలో ఒక్క వికెట్ కూడా నష్టపోకుండా 67 పరుగులు చేసి ముందడుగు వేసింది. ఓపెనర్లు పృథ్వీషా 57 పరుగులతో దూకుడుగా ఆడగా, మన్ జ్యోత్ కల్రా 9 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. భారత బౌలర్లలో అనుకుల్ సుధాకర్ రాయ్ 5, శివమ్ 2 వికెట్లు తీయగా, నాగర్ కోటి, అర్ష్ దీప్ సింగ్ చెరో వికెట్ తీసుకున్నారు. భారత జట్టు తన తొలి మ్యాచ్ లో ఆస్ట్రేలియాపై విజయం సాధించిన సంగతి తెలిసిందే.