Praveen togadia: ప్రవీణ్ తొగాడియా ఆచూకీ లభించింది.. తీవ్ర అస్వస్థతతో ఆసుపత్రిలో చేరిన వీహెచ్‌పీ నేత!
- సోమవారం నుంచి కనిపించని ఆచూకీ
- పోలీసులే అరెస్ట్ చేశారంటూ ఆందోళనకు దిగిన కార్యకర్తలు
- అవాస్తవమన్న పోలీసులు
- ఆసుపత్రిలో ప్రత్యక్షమైన తొగాడియా
విశ్వహిందూ పరిషత్ (వీహెచ్‌పీ) అంతర్జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు ప్రవీణ్ తొగాడియా (65) ఆచూకీ లభించింది. తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన అహ్మదాబాద్‌లోని ఓ ఆసుపత్రిలో ప్రత్యక్షమవడంతో వీహెచ్‌పీ నేతలు ఊపిరి పీల్చుకున్నారు. సోమవారం ఉదయం నుంచి ఆయన కనిపించడం లేదని, ఆయన ఎక్కడున్నారో చెప్పాలంటూ అహ్మదాబాద్‌లోని సోల పోలీస్ స్టేషన్ ఎదుట వీహెచ్‌పీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ఓ కేసులో ఆయనను రాజస్థాన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారని వీహెచ్‌పీ ఆరోపించింది. అయితే అటువంటిదేమీ లేదని రాజస్థాన్ పోలీసులు కొట్టి పడేశారు.
తొగాడియాపై ఉన్న ఓ పాత కేసు విషయంలో రాజస్థాన్ పోలీసులు తమను సంప్రదించారని, అయితే ఆయన నివాసంలో కనిపించకపోవడంతో వారు వెనుదిరిగారని సోల పోలీసులు వివరించారు. దీంతో తొగాడియా ఎక్కడున్నారో తెలియక కార్యకర్తలు ఆందోళన చెందారు. ఆయన ఆచూకీ చెప్పాలంటూ పోలీస్ స్టేషన్‌ను చుట్టుముట్టారు. అలాగే సర్కెజ్-గాంధీనగర్ హైవేను దిగ్బంధం చేశారు.
తొగాడియా ఆచూకీపై సస్పెన్స్ కొనసాగుతుండగానే అహ్మదాబాద్ ఆసుపత్రిలో ఆయన చేరారు. గ్లూకోజ్ లెవల్స్ పడిపోయి స్పృహ కోల్పోయిన ఆయనను చంద్రామణి ఆసుపత్రిలో చేర్చారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితిపై వైద్యుల నుంచి ఎటువంటి సమాచారం లేకపోవడంతో కుటుంబ సభ్యులు, వీహెచ్‌పీ నేతలు, కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు.