KTR: నకిలీ గల్ఫ్ ఏజెంట్లపై కఠిన చర్యలు తీసుకోవాలి: మంత్రులు కేటీఆర్, నాయిని ఆదేశాలు
- ఈ-మైగ్రేట్ లో రిజిస్టర్ చేసుకునేందుకు ఏజెంట్లకు నెల గడువు
- నిర్ణీత గడువులోగా నమోదు చేసుకోకపోతే కఠిన చర్యలు
- అక్రమ ఏజెంట్లుగా గుర్తిస్తాం.. క్రిమినల్ కేసులు నమోదు చేస్తాం
- ఎన్నారై శాఖపై మంత్రులు కేటీఆర్, నాయిని సమీక్ష
బతుకుదెరువు కోసం విదేశాలకు వెళ్లే వారిని మోసం చేస్తున్న నకిలీ గల్ప్ ఏజెంట్లపై కఠిన చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం నిర్ణయించిందని, వారిపై గట్టి చర్యలు తీసుకునేందుకు ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలని సంబంధిత అధికారులను తెలంగాణ మంత్రి కేటీఆర్, హోం శాఖ మంత్రి నాయిని నరసింహారెడ్డి ఆదేశించారు. ఎన్నారై శాఖపై మంత్రులు కేటీఆర్, నాయిని సమీక్ష నిర్వహించారు. సచివాలయంలో జరిగిన ఈ సమీక్షా సమావేశంలో పోలీస్, హోం, ఎన్నారై శాఖల అధికారులు పాల్గొన్నారు. గత వారంలో ఢిల్లీలో విదేశాంగ వ్యవహారాల శాఖ మంత్రి ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో చర్చించిన అంశాలను, రాష్ట్ర స్థాయిలో అమలు చేసేందుకు ఈ సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ, ఈ-మైగ్రేట్ లో రిజిస్టర్ చేసుకునేందుకు ఏజెంట్లకు నెల రోజుల సమయం ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ నెల రోజుల్లోగా నమోదు చేసుకోని ఏజెంట్లను అక్రమ ఏజెంట్లుగా గుర్తిస్తామని మంత్రులు తెలిపారు. రిజిస్టర్ చేసుకోని అక్రమ ఏజెంట్లపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని, ప్రభుత్వ హెచ్చరికలు ఖాతారు చేయకుండా పదేపదే వీసాల మోసాలకు పాల్పడే వారిపైన పీడీ యాక్టు ప్రకారం కేసులు పెట్టాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. అక్రమ ఏజెంట్ల పైన చర్యలు తీసుకునే విషయంలో పోలీసులకు ప్రజలు సహకరించాలని మంత్రులు విజ్ఞప్తి చేశారు. ‘సురక్షితంగా వెళ్లండి, సుశిక్షితులై వెళ్లండి’ అనే కేంద్ర ప్రభుత్వ విదేశాంగ శాఖ నినాదానికి అనుగుణంగా తెలంగాణ ప్రభుత్వ టామ్ కాం కంపెనీ ద్వారా చట్టపరంగా విదేశాలకు వెళ్లాలని సూచించారు. రాష్ట్రంలో ఉన్న రిజిస్టర్డ్ ఏజెంట్ల ద్వారానే వెళ్లాలని కోరారు.
హైదరాబాద్ లో విదేశీ భవన్ కు ఫిబ్రవరి రెండోవారంలో శంకుస్థాపన చేసేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలన్న మంత్రులు రంగారెడ్డి జిల్లా కలెక్టర్, ఎన్నారై శాఖాధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నారైలకు, వలస కార్మికుల కోసం చేపడుతున్న చర్యలను, ప్రభుత్వ పథకాలను ప్రజలకు తెలియజేసేలా ప్రచారం చేయాలని కేటీఆర్ అన్నారు. గల్ఫ్ దేశాలకు జరుగుతున్న మహిళల అక్రమ రవాణా, మోసపూరిత వివాహాలపైనా మరింత కఠినంగా వ్యవహరించాలని కోరారు. ఈ విషయంలో రాష్ట్ర పోలీసు శాఖ కొంత కాలంగా తీసుకుంటున్న చర్యలను మంత్రి అభినందించారు. మానవ అక్రమ రవాణాను అరికట్టడంలో మైనార్టీ సంక్షేమ శాఖ, కార్మిక శాఖ, ఎన్నారై శాఖ, పోలీస్ శాఖలు ఉమ్మడి సంయుక్త సమన్వయ బృందాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.
ఇక్కడ పోలీసుల చర్యలతో ముంబై, కోల్ కతా వంటి ప్రాంతాల నుంచి ఇలాంటి ప్రయత్నాలు జరుగుతున్న నేపథ్యంలో ఆయా రాష్ట్రాల అధికారుల సహకారం తీసుకోవాలని సూచించారు. ఈ మానవ అక్రమ రవాణకు పాల్పడుతున్న ఏజెంట్లపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని, ఈ మేరకు పాస్ పోర్టు కార్యాలయ అధికారుల సహకారం తీసుకోవాలని సూచించారు. కాగా, నకిలీ ఏజెంట్లపైన చర్యలు తీసుకుంటామని, ఇందుకు సంబంధించి త్వరలోనే మార్గదర్శకాలు జారీ చేస్తామని డీజీపీ మహేందర్ రెడ్డి తెలిపారు.