BJP: రాహుల్ గాంధీ.. ఈ విషయాన్ని గుర్తు పెట్టుకుంటే మంచిది!: బీజేపీ
- సుప్రీంకోర్టు వ్యవహారంలో జోక్యం చేసుకోవద్దు
- రాజకీయం చేయవద్దు
- దేశ ప్రజలంతా చూస్తున్నారు
నలుగురు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు సర్వోన్నత న్యాయస్థానం అడ్మినిస్ట్రేషన్ పై నిన్న విమర్శలు గుప్పించిన సంగతి తెలిపిందే. వీరు ఏకంగా చీఫ్ జస్టిస్ వ్యవహారశైలినే తప్పుబట్టారు. దేశ వ్యాప్తంగా సంచలనం రేకిత్తించిన ఈ వ్యవహారం... చివరకు రాజకీయ రంగు పులుముకునే దిశగా సాగుతోంది. ఈ అంశంపై కాంగ్రెస్ పార్టీ స్పందిస్తూ, పరోక్షంగా బీజేపీపై ఆరోపణలు చేసింది. ఈ నేపథ్యంలో, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీపై బీజేపీ మండిపడింది. సుప్రీంకోర్టు వ్యవహారంలో జోక్యం చేసుకోవద్దంటూ ఆయనను హెచ్చరించింది. ఈ అంశాన్ని రాజకీయం చేసే ప్రయత్నం చేయవద్దని, ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుంటే మంచిదని హితవు పలికింది.
న్యాయ వ్యవస్థకు సంబంధించిన అంశాల్లో రాజకీయ జోక్యం ఉండరాదని బీజేపీ తెలిపింది. ఏ ఒక్కరు కూడా ఈ అంశాన్ని రాజకీయం చేయవద్దని కోరింది. కాంగ్రెస్ పార్టీ ఈ విషయాన్ని రాజకీయం చేసేందుకు యత్నిస్తోందనే విషయాన్ని దేశ ప్రజలందరూ చూస్తున్నారంటూ కామెంట్ చేసింది.