Narendra Modi: ఢిల్లీలో ప్రధాని మోదీకి ఏపీ సీఎం చంద్రబాబు వివరించిన అంశాలు ఇవే!

  • రాష్ట్ర‌ విభజనతో ఆంధ్రప్రదేశ్ కి ఆర్థిక లోటు 
  • ఆర్థిక‌ వనరుల నికర ఆదాయం, తలసరి ఆదాయం పెంచడానికి సహకరించాలి
  • కేంద్ర ప్ర‌భుత్వం ఇచ్చే ప్రోత్సాహ సాయం తక్కువగా ఉంది
  • పోలవరం ప్రాజెక్టుకు ఖర్చు చేసిన నిధులను సత్వరమే విడుదల చేయాలి

ఆంధ్రప్రదేశ్ సమగ్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం సంపూర్ణ సహాయ సహకారాలు అందిస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేసినట్లు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఆంధ్రప్రదేశ్ సమగ్రాభివృద్ధికి కేంద్ర ప్రభుత్వ సాయాన్ని కోరుతూ చంద్రబాబు నాయుడు ఈ రోజు ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీని కలిసి మెమొరాండం సమర్పించి, ప్రత్యేకంగా సమావేశమైన విష‌యం తెలిసిందే. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ భవన్‌లోని గురజాడ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చంద్ర‌బాబు మాట్లాడుతూ... రాష్ట్ర‌ విభజనతో ఆంధ్రప్రదేశ్ కి ఆర్థిక లోటు వ‌చ్చింద‌ని, అయిన‌ప్ప‌టికీ రాష్ట్రంలో ఉన్న మౌలిక వనరులను సద్వినియోగ పరచుకుంటూ అభివృద్ధి వైపు పయనిస్తున్నామ‌ని తెలిపారు.

అయితే, ఆర్థిక‌ వనరుల నికర ఆదాయం, తలసరి ఆదాయం, జాతీయ ఆదాయం పెంపుదలకు కేంద్ర ప్రభుత్వం సహకరించవలసిన ఆవశ్యకతను ప్రధానికి వివరించినట్లు చంద్రబాబు చెప్పారు. రాష్ట్ర విభజన జరిగి మూడున్న‌ర‌ సంవత్సరాలు గడచినప్పటికీ కేంద్ర ప్ర‌భుత్వం ఇచ్చే ప్రోత్సాహ సాయం తక్కువగా ఉంద‌ని, విభజనలో పొందుపరచిన అంశాలను పునఃపరిశీలించి రాష్ట్రానికి తగిన రీతిన నిధులను సమకూర్చాల‌ని ప్రధాన మంత్రికి విజ్ఞప్తి చేసినట్లు చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ప్రధానంగా వ్యవసాయ రంగంపై ఆధారపడి ఉన్నదని, పారిశ్రామికంగా అభివృద్ధి సాధించినప్పుడే సర్వీస్ సెక్టార్ లో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెంపొంది అనుకున్న ఫలితాలను, ఆర్థిక ప్రగతిని సాధించగలమని ఇందుకు దక్షిణాది రాష్ట్రాల ఆదాయ వనరులు, మౌలిక వనరులను పోలుస్తూ సవివరంగా ప్రధానికి విశదీకరించినట్లు చెప్పారు.

ప్రస్తుత ధరల సూచిక ప్రకారం అభివృద్ధి రంగంలో ఆంధ్ర ప్రదేశ్ భాగస్వామ్య సూచికను విశదీకరిస్తూ సర్వీస్ సెక్టార్ లో తెలంగాణ రాష్ట్రం 62.56 శాతం, తమిళనాడు 56.88 శాతం, కర్ణాటక 64.64 శాతం, అఖిల భారత స్థాయిలో 53.66 శాతం అభివృద్ధిని సాధించగా పారిశ్రామికాభివృద్ధి లేనందున ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం 46 శాతం మాత్రమే అభివృద్ధిని చేరుకోగలిగిందని వివరించారు.

వ్యవసాయ రంగంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 31.77 శాతం, 15.34 శాతం, తమిళనాడు 11.39 శాతం, కర్ణాటక 11.68 శాతం, అఖిల భారత స్థాయిలో 17.32 శాతం అభివృద్ధి సాధించగా, పారిశ్రామిక రంగంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 22.23 శాతం, తెలంగాణ 22.10 శాతం, తమిళనాడు 31.72 శాతం, కర్ణాటక 23.68 శాతం, అఖిల భారత స్థాయిలో 29.02 శాతం అభివృద్ధి భాగస్వామ్యం ఉందని పేర్కొన్నారు.

దేశీయ ఉత్పాదక రంగంలో 2011-12 ఆర్థిక సంవత్సరం అభివృద్ధి సూచిక ఆధారంగా 2013-14 ఆర్థిక సంవత్సరంలో ఆంధ్ర ప్రదేశ్ వాటా 50.69 శాతం, తెలంగాణ 49.31 శాతం ఉండగా 2014-15 సంవత్సరంలో 51.01 శాతం, 48.99 శాతం, 2015-16 సవత్సరంలో 51.80 శాతం, 48.20 శాతం, 2016-17 సంవత్సరంలో 51.97 శాతం, 48.01 శాతంతో ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు వరుస క్రమంలో ఉన్నాయని తెలిపారు. దక్షిణాది రాష్ట్రాలలో జనాభా అభివృద్ధి, పారిశ్రామిక, ఇతర రంగాలలో ఆర్థిక అభివృద్ధి సాధనలో తలసరి ఆదాయం ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో 2013-14 సంవత్సరంలో 12.99 శాతం ఉండగా, విభజన అనంతరం ఆంధ్ర ప్రదేశ్ 10.96 శాతం, తెలంగాణ రాష్ట్రం 11.24 శాతం, తమిళనాడు 11 శాతం, కర్ణాటక 17 శాతం, కేరళ 11.85 శాతం ఉండగా జాతీయ స్థాయిలో 11.46 శాతం ఉందన్నారు.

2014- 15 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ లో వనరుల వినియోగంతో వృద్ధి రేటులో గణనీయ ప్రగతిని సాధిస్తూ తలసరి ఆదాయాన్ని 13.07 శాతంతో గణనీయంగా పెంచుకోగలిగామని, ఈ వృద్ధి రేటు తెలంగాణలో 12 శాతం, తమిళనాడు 11.68 శాతం, కర్ణాటక 11.64 శాతం, కేరళ 12.81 శాతం తలసరి ఆదాయ వృద్ధి రేటును సాధించగా, అఖిల భారత స్థాయిలో 9.31 శాతం ఉందన్నారు. 2015-16 సంవత్సరంలో ఆంధ్ర ప్రదేశ్ 15.44 శాతం, తెలంగాణ 9.63 శాతం, తమిళనాడు 5.87 శాతం, కర్ణాటకలో 7.55 శాతం, కేరళలో 5.74 శాతం ఉండగా జాతీయ స్థాయిలో 8.80 శాతం ఉందన్నారు.  

2016-17 సంవత్సరంలో తలసరి ఆదాయ వృద్ధి రేటు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో 13.14 శాతం, తెలంగాణలో 12.80 శాతం, తమిళనాడులో 11.19 శాతం, కేరళలో 10.19 శాతం ఉండగా జాతీయ స్థాయిలో 9.66 శాతం వృద్ధి రేటు ఉందన్నారు. జనాభా ప్రాతిపదికన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం సముచితంగా నిధులు కేటాయించాలని ప్రధాని నరేంద్ర మోదీకి సవివరంగా విశదీకరించినట్లు చంద్రబాబు నాయుడు మీడియాకు చెప్పారు.
 
గోదావరి నదిపై ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి ఖర్చు చేసిన నిధులను సత్వరమే విడుదల చేయాలని ప్రధాని నరేంద్ర మోదీకి విజ్ఞప్తి చేసినట్లు చంద్రబాబు నాయుడు చెప్పారు. 2019 సంవత్సరం నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసే లక్ష్యంతో ఉన్నామని, జాతీయ ప్రాజెక్టుగా చేపట్టిన పోలవరం ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు 7780.07 కోట్ల రూపాయలు ఖర్చు చేసిందని, దీనిలో 4329.06 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిందని, మిగిలిన 3451.01 కోట్ల రూపాయలను సత్వరమే విడుదల చేయాలని విజ్ఞప్తి చేసినట్లు చెప్పారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి సమగ్ర నివేదికను కూడా కేంద్ర జలవనరుల శాఖకు సమర్పించినట్లు వెల్లడించారు.

అమరావతి గ్రీన్ ఫీల్డ్ రాజధానిని 2500 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మాణం చేస్తున్నందుకు ఈ నిర్మాణాలకు కేంద్ర ప్రభుత్వం తగిన సాయం అందించాలని ప్రధానిని కోరినట్లు చెప్పారు. దీనిలో వెయ్యి కోట్ల రూపాయల వ్యయంతో భూగర్భ మురుగునీటి పారుదల వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతున్న విశాఖపట్నం మరింత అభివృద్ధి పరచేందుకు తగిన ప్రోత్సాహం ఇవ్వాలని కోరుతూ విశాఖపట్నం కేంద్రంగా రైల్వే జోన్ ను కొత్తగా ఏర్పాటు చేయాలని, దీని వల్ల ప్రయాణికులకు ఎంతో వెసులుబాటుతో పాటు రాష్ట్ర ప్రగతిలో విశాఖ రైల్వే జోన్ కీలక భూమిక కాగలదని దీని ఆవశ్యకతను ప్రధానికి సవివరంగా వివరించినట్లు తెలిపారు.

కాకినాడ కేంద్రంగా పెట్రోలియం కారిడార్ ఏర్పాటుకు GAIL, HPCL సంస్థలు సంసిద్ధంగా ఉన్నందున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టంలోని 9వ షెడ్యులు అనుసరించి పెట్రోలియం కారిడార్ ఏర్పాటుకు తోడ్పాటునివ్వాలని ప్రధానిని కోరినట్లు చెప్పారు. మీడియా సమావేశంలో కేంద్ర మంత్రులు అశోక్ గజపతి రాజు, వై.ఎస్.చౌదరి, ఎంపీలు కొనకళ్ల‌ నారాయణ రావు, సి.ఎం.రమేష్, రాజ్యసభ మాజీ సభ్యులు కంభంపాటి రామ్మోహన రావు, ప‌లువురు అధికారులు పాల్గొన్నారు.

  • Loading...

More Telugu News