Supreme Court: నిజాయతీపరుడైన ఓ న్యాయమూర్తి చనిపోతే నిర్లక్ష్యం తగదు!: జడ్జి లోయా మృతి కేసుపై సుప్రీం కీలక వ్యాఖ్యలు
- నిర్లక్ష్యం వహించడం సమాజానికి తప్పుడు సంకేతాలు అందిస్తుంది
- ఈ కేసుకు సంబంధించిన పూర్తి పత్రాలు, నివేదికలు అందించాలి
- మహారాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ధర్మాసనం ఆదేశాలు
‘ఇది ఎంతో ప్రమాదకరమైన అంశం. నిజాయతీపరుడైన ఓ న్యాయమూర్తి చనిపోతే నిర్లక్ష్యం వహించడం సమాజానికి తప్పుడు సంకేతాలు అందిస్తుంది’ అని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం జడ్జి బీహెచ్ లోయా మృతి కేసుపై సుప్రీంకోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించింది. సోహ్రాబుద్దీన్ నకిలీ ఎన్ కౌంటర్ కేసులో వాదనలు వింటున్న జడ్జి లోయా ఈ తీర్పు వెలువరించడానికి కొన్ని రోజుల ముందు మృతి చెందారు.
అయితే, లోయా మృతి విషయంలో అనుమానాలు ఉన్నాయంటూ మహారాష్ట్రకు చెందిన బీఆర్ లోనే అనే ఓ పాత్రికేయుడు ఓ పిటిషన్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో ఈ కేసుపై ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ కేసుకు సంబంధించిన పూర్తి పత్రాలను, నివేదికలను సోమవారం నాటికి తమకు సమర్పించాలని మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ధర్మాసనం ఆదేశించింది. ‘లోయా మృతి కేసులో అల్లుకున్న అనుమానాలు నివృత్తి అయితేనే.. న్యాయవ్యవస్థ సామర్థ్యం, నిజాయతీ పట్ల సాధారణ పౌరుడిలో ఉన్న విశ్వాసం పునరుద్ధరింపబడుతుంది’ అంటూ ధర్మాసనం వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
కాగా, తన సహచర జడ్జి కూతురి వివాహం నిమిత్తం లోయా మరో ఇద్దరు జడ్జిలతో కలిసి 2014 డిసెంబర్ 1న నాగ్ పూర్ వెళ్లారు. ప్రభుత్వ అతిథి గృహంలో బస చేసిన ఆయన గుండెపోటుకు గురై మరణించారు. లోయాది సహజ మరణమేనని వైద్యులు కూడా ధ్రువీకరించారు. అయితే, లోయా మృతి చెందిన సమయంలో ఆయన ధరించిన దుస్తులపై రక్తపు మరకలు ఎలా వచ్చాయనే విషయాన్ని ఆయన కుటుంబసభ్యులు ప్రశ్నిస్తున్నారు.
అంతేకాదు, లోయా అంత్యక్రియలు తమకు తెలియకుండానే నిర్వహించేశారని, వారం రోజుల తర్వాత ఆయన మొబైల్ ఫోన్ ని తమకు ఇచ్చారని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. లోయా సోదరి అనూరాధ బియాని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చేసిన సంచలన వ్యాఖ్యలను ఈ సందర్భంగా ప్రస్తావించుకోవాలి. సోహ్రబుద్దీన్ ఎన్ కౌంటర్ కేసు విచారిస్తున్న జడ్జి లోయాకు రూ.100 కోట్లను లంచంగా ఇవ్వజూపారని ఆరోపించారు. నిజాయతీపరుడైన తన సోదరుడు లోయా అందుకు తిరస్కరించిన విషయాన్ని ఆమె ప్రస్తావించడం గమనార్హం.