passport: పాస్‌పోర్టులు.. ఇకపై అడ్రస్ ప్రూఫ్ లకు పనికిరావు.. రంగు కూడా మారుతున్నాయి!
- పాస్ పోర్టు చివరి పేజీలో చిరునామా ఉండదు
- స్పష్టం చేసిన విదేశాంగ శాఖ అధికారులు
- పాస్ పోర్టు రంగు కూడా మారే అవకాశం
పాస్ పోర్టుల విషయంలో కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై పాస్ పోర్టు చివరి పేజీలో చిరునామా వివరాలను ముద్రించకుండా, ఖాళీగా వదిలేయాలని నిర్ణయించింది. ఇది అమల్లోకి వస్తే, అడ్రస్ ప్రూఫ్ లకు ఇకపై పాస్ పోర్టులు పనికిరావు.
ఈ మార్పుపై ఇంతవరకు విదేశాంగ శాఖ అధికారికంగా స్పందించకపోయినప్పటికీ... పాస్ పోర్ట్ మరియు వీసా డివిజన్ లో పాలసీ మరియు లీగల్ వ్యవహారాల అండర్ సెక్రటరీగా బాధ్యతలను నిర్వహిస్తున్న సురీందర్ కుమార్ దీనిపై స్పష్టతను ఇచ్చారు. తదుపరి సిరీస్ పాస్ పోర్టులను ఇష్యూ చేసే సమయంలో ఈ నిర్ణయాన్ని అమలు చేయబోతున్నామని ఆయన తెలిపారు. పాస్ పోర్ట్ దారుడి వివరాలను గోప్యంగా ఉంచేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. కొన్ని మార్పులు త్వరలోనే చోటు చేసుకునే అవకాశం ఉందని పూణే రీజినల్ పాస్ పోర్ట్ కేంద్ర అధికారి వైషాంపాయన్ కూడా తెలిపారు.
పాస్ పోర్ట్ చివరి పేజీ ఎలాంటి వివరాలు లేకుండా ఖాళీగా ఉన్నప్పటికీ పాస్ పోర్ట్ కార్యాలయానికి కానీ, ఇమ్మిగ్రేషన్ డిపార్ట్ మెంట్ కు కానీ ఎలాంటి ఇబ్బంది లేదని... పాస్ పోర్ట్ దారుడికి సంబంధించిన అన్ని వివరాలు బ్యాక్ ఎండ్ లో ఉంటాయని వీరు తెలిపారు. 2012 నుంచి పాస్ పోర్టులపై బార్ కోడ్ ఉంటోందని.. ఈ బార్ కోడ్ ను స్కాన్ చేస్తే వివరాలన్నీ ప్రత్యక్షమవుతాయని చెప్పారు.
పాత పాస్ పోర్టులను గడువు ముగిసే వరకు వినియోగించుకోవచ్చని... రెన్యువల్ సమయంలో ఈ మార్పులు వర్తిస్తాయని చెప్పారు. పాస్ పోర్టు రంగును కూడా మార్చబోతున్నారు. ప్రస్తుతం మూడు రంగుల్లో పాస్ పోర్టులను ఇష్యూ చేస్తున్నారు. ప్రభుత్వ అధికారులు, ప్రభుత్వ అధికారిక పనులపై విదేశాలకు వెళ్లే వారికి తెల్లరంగు పాస్ పోర్టు, దౌత్యవేత్తలకు ఎరుపు రంగు పాస్ పోర్ట్, మిగిలిన అందరికీ (ఈసీఆర్ మరియు ఈసీఎన్ఆర్) నీలి రంగు పాస్ పోర్టులను ఇస్తున్నారు. వీరిలో ఈసీఆర్ కేటగిరీకి ఆరంజ్ కలర్ పాస్ పోర్టులను ఇచ్చే అవకాశం ఉందని సురీందర్ కుమార్ తెలిపారు. దీని వల్ల ఇమ్మిగ్రేషన్ ప్రక్రియ వేగవంతమవుతుందని చెప్పారు. కొత్త పాస్ పోర్టులను నాసిక్ లోని ఇండియా సెక్యూరిటీ ప్రెస్ లో ముద్రిస్తామని తెలిపారు.