Chandrababu: విన్నపాలు వినవలె.. మోదీకి 17 పేజీల వినతిపత్రం ఇచ్చిన చంద్రబాబు
- ముగిసిన మోదీ, చంద్రబాబుల భేటీ
- రాష్ట్ర సమస్యలను ఏకరువు పెట్టిన బాబు
- సానుకూలంగా స్పందించిన మోదీ
ప్రధాని మోదీతో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు భేటీ ముగిసింది. ఈ సమావేశం దాదాపు గంట సేపు కొనసాగింది. భేటీలో విభజన సమస్యలు, పోలవరం, నియోజకవర్గాల పునర్విభజన, రెవెన్యూ లోటు సహా పలు అంశాలపై చర్చ జరిగింది. ఈఏపీ నిధులతో పాటు 9, 10 షెడ్యూల్స్ లోని సంస్థల విభజన అంశాలపై చంద్రబాబు చర్చించినట్టు సమాచారం. ఈ సందర్భంగా మోదీకి 17 పేజీల వినతిపత్రాన్ని చంద్రబాబు అందించారు.
శాసనసభ నియోజకవర్గాల సంఖ్యను 175 నుంచి 225కి పెంచాలని ఈ సందర్భంగా చంద్రబాబు కోరారు. అమరావతి నిర్మాణం కోసం వచ్చే కేంద్ర బడ్జెట్ లో తగినన్ని నిధులను కేటాయించాలని విన్నవించారు. పోలవరం ప్రాజెక్టుకు అయ్యే ఖర్చు మొత్తాన్ని కేంద్రమే భరించాలని చెప్పారు. కృష్ణా నది యాజమాన్య బోర్డు పరిధి, విధివిధానాలను ఖరారు చేసి, నోటిఫికేషన్ జారీ చేసే ప్రక్రియను వెంటనే పూర్తి చేయాలని కోరారు. పునర్విభజన చట్టంలో పేర్కొన్న హామీలనన్నింటినీ నెరవేర్చాలని విన్నవించారు. దుగరాజపట్నం ఓడరేవు అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని కోరారు. పన్నుల పంపిణీలో వ్యత్యాసాలను తొలగించాలని చెప్పారు. చంద్రబాబు విన్నపాలకు మోదీ సానుకూలంగా స్పందించినట్టు సమాచారం. కాసేపట్లో చంద్రబాబు మీడియా ప్రతినిధులతో మాట్లాడనున్నారు.