Telangana: ‘ఇంగ్లిష్’ నేర్చుకోవాలనుకునే వారికి సదవకాశం.. టి-సాట్ లో జనవరి 14 నుండి ఆంగ్ల బోధన

  • నిపుణ, విద్య ఛానళ్లలో ఆంగ్ల బోధన 
  • జనవరి 14 నుండి ప్రతి ఆదివారం ప్రసారం
  • టి-సాట్ సీఈఓ ఆర్. శైలేష్ రెడ్డి ప్రకటన

టి-సాట్ నెట్వర్క్ ఛానళ్లు ఈ నెల 14 నుంచి ప్రతి ఆదివారం నిపుణ, విద్య ఛానళ్లలో ఆంగ్ల బోధనను ప్రసారం చేయనున్నాయి. ఈ మేరకు టి-సాట్ సీఈఓ ఆర్. శైలేష్ రెడ్డి ఓ ప్రకటన విడుదల చేశారు. విద్యార్థుల కోసం పలు పోటీ పరీక్షలకు అవగాహన కార్యక్రమాలను అందిస్తున్న టి-సాట్ నెట్వర్క్ ఛానళ్లు రామకృష్ణా మఠ్ సౌజన్యంతో ‘ఇంగ్లిష్ ఫర్ ఆల్’ పేరిట ఈ కార్యక్రమాన్ని అందిస్తున్నట్టు తెలిపారు. ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు నిపుణ ఛానల్ లో, సాయంత్రం నాలుగు గంటలకు విద్య ఛానల్ లో 45 నిమిషాల పాటు 86 ఎపిసోడ్స్ ప్రసారం చేస్తామని తెలిపారు.

ఇంగ్లీష్ నేర్చుకోవాలని ఉత్సుకత కలవారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. తెలంగాణ ప్రభుత్వం నిర్వహించే టీచర్స్ రిక్రూట్ మెంట్ కోసం టి-సాట్ నెట్వర్క్ ఛానళ్లు ప్రసారం చేస్తున్న అవగాహన ప్రసారాలను ఈ నెల 12వ తేదీ శుక్రవారం నుండి మరో మూడు గంటలు అదనంగా ప్రసారం చేస్తున్నట్లు ఆ ప్రకటనలో తెలిపారు. సంక్రాంతి పండగ సందర్భంగా ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలకు సెలవుల దృష్ట్యా ఐదు రోజులపాటు ఈ అదనపు ప్రసారాలు కొనసాగిస్తున్నట్లు తెలిపారు.

ఇప్పటికే, సాట్ నిపుణ, విద్య ఛానల్ లో కొనసాగుతున్న ప్రసారాలకు అదనంగా నిపుణ ఛానల్ లో మధ్యాహ్నం ఒంటి గంట నుండి నాలుగు గంటల వరకు, విద్య ఛానల్ లో ఉదయం 10 గంటల నుండి ఒంటి గంట వరకు ఈ ప్రసారాలు ఉంటాయని, పోటీ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు టి-సాట్ అందించే అదనపు గంటల ప్రసారాలను సద్వినియోగం చేసుకోవాలని శైలేష్ రెడ్డి సూచించారు.

  • Loading...

More Telugu News