Telangana: 13 నుంచి ‘స్వీట్ ఫెస్టివల్’.. అందుబాటు ధరల్లో 1000 రకాల స్వీట్లు: తెలంగాణ పర్యాటక, సాంస్కృతిక శాఖ
- 13 నుండి 15 వరకు అంతర్జాతీయ పతంగుల పండగతో పాటు ‘స్వీట్ ఫెస్టివల్’
- వేదికగా సికింద్రాబాద్ లోని పరేడ్ గ్రౌండ్స్
- ఉచిత ప్రవేశం..అందుబాటు ధరలలో స్వీట్లు
ఈ నెల 13 నుండి 15 వరకు తెలంగాణ పర్యాటక శాఖ మూడోసారి అంతర్జాతీయ పతంగుల పండగతో పాటు ‘స్వీట్ ఫెస్టివల్’ ను కలిపి నిర్వహించనుంది. ఈ సందర్భంగా వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు. తెలంగాణ సచివాలయంలో పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి ఆజ్మీరా చందూలాల్, పర్యాటక కార్యదర్శి బుర్రా వెంకటేశంతో కలిసి ఈ వాల్ పోస్టర్ ను విడుదల చేశారు.
అనంతరం చందూలాల్ మాట్లాడుతూ, సంక్రాంతి పండుగ సందర్భంగా సికింద్రాబాద్ లోని పరేడ్ గ్రౌండ్స్ లో పతంగుల పండగతో పాటు ‘స్వీట్ ఫెస్టివల్’ ను కలిపి నిర్వహిస్తున్నట్టు చెప్పారు. ‘స్వీట్ ఫెస్టివల్’లో 1000 రకాల స్వీట్లను ఒకే వేదికపైన ప్రదర్శించనున్నామని, ఈ విధంగా చేయడం ప్రపంచంలో ఇదే మెుదటిసారి అని అన్నారు. హైదరాబాద్ లో నివసిస్తున్న వివిధ రాష్ట్రాల, దేశాల ప్రజలు స్వయంగా తయారు చేసిన ఈ స్వీట్లను ప్రదర్శించడమే కాకుండా, అమ్మకాలు రూపుకునేందుకు కౌంటర్లను ఏర్పాటు చేశామని చెప్పారు.
అనంతరం, బుర్రా వెంకటేశం మాట్లాడుతూ, అంతర్జాతీయ పతంగుల పండగతో పాటు ‘స్వీట్ ఫెస్టివల్’లో పాల్గొనే వారికి ఉచిత ప్రవేశం కల్పిస్తున్నట్టు చెప్పారు. హైదరాబాద్ కి అంతర్జాతీయ నగరంగా పేరుందని, ఆ స్థాయిలో ‘స్వీట్ ఫెస్టివల్’ను నిర్వహిస్తున్నామని, వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన మహిళలు ఒకే కౌంటర్ వద్ద స్వీట్లను తయారు చేస్తారని, ఆ దృశ్యం ‘మినీ ఇండియా’ను తలపించే విధంగా ఉంటుందని అన్నారు.
వివిధ సంస్కృతులు, సంప్రదాయాల ప్రకారం ఈ స్వీట్లు తయారు చేస్తున్నారని, ఇది భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీకగా నిలుస్తుందని చెప్పారు. 15 దేశాలతో పాటు 25 రాష్ట్రాల నుంచి మహిళలు స్వయంగా తయారు చేసిన వెయ్యి రకాల స్వీట్లు అందరికీ అందుబాటు ధరలలో ఉంటాయని, రోజుకి లక్ష మందికి పైగా సందర్శకులు వచ్చే అవకాశాలు ఉన్నాయని అన్నారు.