minister devineni uma: 'మంత్రి దేవినేని ఉమా సోదరుని అనుచరుల నుంచి ప్రాణ హాని ఉంది' అంటూ జూబ్లిహిల్స్ పీఎస్ లో కేసు నమోదు!

  • అమరావతిలో ఉన్న రెండున్నర ఎకరాల భూమిపై కన్ను
  • ముగ్గురు వ్యక్తుల నుంచి వేధింపులు
  • పోలీసులను ఆశ్రయించిన అట్లూరి సురేష్ దంపతులు

ఆంధ్రప్రదేశ్ మంత్రి దేవినేని ఉమా సోదరుని అనుచరుల నుంచి తనకు ప్రాణహాని ఉందంటూ జూబ్లిహిల్స్ పోలీసు స్టేషన్ లో ఓ కేసు దాఖలైంది. అమరావతిలో తమకున్న భూమిని ఇవ్వాలని మంత్రి సోదరుని అనుచరుల పేరుతో కొందరు బెదిరిస్తున్నారంటూ హైదరాబాద్ లో నివసించే అట్లూరి సురేష్, ఆయన సతీమణి ప్రవిజ పోలీసులను ఆశ్రయించారు. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

సురేష్, ప్రవిజకు కొన్నేళ్ల క్రితం వివాహం అయింది. అమరావతి సమీపంలో ఉన్న రెండున్నర ఎకరాల భూమిని సురేష్ కు ఇస్తామని అప్పట్లో ప్రవిజ తల్లిదండ్రులు సురేష్ కు హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం ప్రవిజ తల్లి పేరు మీద ఉన్న ఆ భూమిని సురేష్ కు బదలాయించే ప్రయత్నం చేయగా, మంత్రి దేవినేని ఉమా సోదరుని అనుచరులమంటూ నాని, రాజేందర్ మరో వ్యక్తి రంగంలోకి దిగారు.

భూమి సురేష్ పేరు మీదకు మార్చుకోవాలంటే తమకు కొంత చెల్లించాలని డిమాండ్ చేశారు. ప్రవిజ తల్లితో కలసి గతంలో వ్యాపారం చేయగా నష్టం వచ్చిందంటూ వివాదం సృష్టించారు. దీనిపై సురేష్ విజయవాడలో మూడు సార్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సివిల్ కోర్టులో కూడా కేసు నమోదు చేశారు. అయితే, వేధింపులు ఆగలేదు. ప్రవిజపై దాడి కూడా జరిగింది. అక్కడి నుంచి హైదరాబాద్ కు మకాం మార్చినా కూడా సురేష్ దంపతులను వారు వేధించడం ఆపలేదు. ఇప్పుడు మాట కూడా మార్చి ... అసలు ఆ భూమి మార్చుకునేందుకు వీల్లేదని, తమకు స్వాధీనం చేయాలంటూ వేధిస్తుండడంతో వీరు జూబ్లిహిల్స్ పోలీసులను ఆశ్రయించారు.

  • Loading...

More Telugu News