google: గూగుల్ వారి కొత్త యాప్... డిజిటల్ చెల్లింపులు ఇక మరింత సులభతరం!
- గూగుల్ పే పేరుతో కొత్త సౌకర్యం
- గూగుల్ వ్యాలెట్, ఆండ్రాయిడ్ పే యాప్‌ల మేళవింపు
- తేజ్ వినియోగదారులకు కూడా కొత్త సౌకర్యాలు
నోట్ల రద్దు తర్వాత డిజిటల్ చెల్లింపుల ప్రోత్సాహం కోసం రోజుకో యాప్ పుట్టుకొస్తున్న సంగతి తెలిసిందే. వ్యాలెట్‌లు, పేమెంట్లు, లావాదేవీలు ఇలా అన్ని రకాల సేవలకు ప్రత్యేక యాప్‌లు వచ్చాయి. టెక్నాలజీ దిగ్గజం గూగుల్ కూడా తేజ్ యాప్, గూగుల్ వ్యాలెట్, ఆండ్రాయిడ్ పే వంటి డిజిటల్ చెల్లింపుల యాప్‌లను అందుబాటులోకి తెచ్చింది. ఇదే బాటలో పేమెంట్ సేవలను మరింత సులభతరం చేసేందుకు గూగుల్ పే పేరుతో మరో యాప్‌ను అందుబాటులోకి తీసుకురానుంది.
ఈ గూగుల్ పే యాప్ ద్వారా చేసిన చెల్లింపుల వివరాలన్నీ సంబంధిత వ్యక్తి గూగుల్ ఖాతాలో అందుబాటులో ఉంటాయని సంస్థ ఉత్పత్తుల మేనేజ్‌మెంట్ ఉపాధ్యక్షుడు పాలి భట్ తెలిపారు. గూగుల్ వ్యాలెట్, ఆండ్రాయిడ్ పే యాప్‌ల మేళవింపుగా ఈ యాప్‌ను రూపొందించారు. డైస్, ఫన్‌డాంగో, హంగ్రీ హౌస్, ఇన్‌స్టాకార్ట్, మరిన్ని ఇతర యాప్‌లు ఇప్పటికే గూగుల్ పే సేవలను ఉపయోగించుకుంటున్నాయి. తేజ్ యాప్ వాడుతున్న వారికి కూడా గూగుల్ పేలో ఉన్న అన్ని నూతన సౌకర్యాలను వినియోగించుకునే అవకాశాన్ని గూగుల్ కల్పించనున్నట్లు తెలుస్తోంది.