nobel: నోబెల్ గ్రహీత హర్ గోబింద్ ఖురానాను గుర్తుచేసిన గూగుల్
- ఫొటో, పరిశోధనలను కలిపి డూడుల్ డిజైన్
- జన్యుక్రమంపై పరిశోధనలు చేసిన హర్ గోబింద్
- 1968లో వైద్యరంగంలో నోబెల్
జన్యుక్రమం అధ్యయనం కోసం డీఎన్ఏ, ఆర్ఎన్ఏలపై విస్తృత పరిశోధనలు చేసిన భారత అమెరికన్ బయోకెమిస్ట్ హర్ గోబింద్ ఖురానాను సెర్చింజన్ దిగ్గజం గూగుల్ గుర్తుచేసింది. ఈరోజు ఆయన జయంతి సందర్భంగా ఫొటో, పరిశోధనలతో కలిపి డూడుల్ ను డిజైన్ చేసి నివాళి ప్రకటించింది. డీఎన్ఏలో ఉండే న్యూక్లిక్ యాసిడ్పై హర్ గోబింద్ పరిశోధనలు చేసి వాటిలో ఉన్న న్యూక్లియోటైడ్స్ క్రమాన్ని గుర్తించారు. అందుకు గాను ఆయన 1968లో వైద్యరంగ నోబెల్ బహుమతిని అందుకున్నారు.
1922 జనవరి 9న అప్పటి బ్రిటిష్ ఇండియాలోని రాయ్పూర్ (ప్రస్తుతం పాకిస్థాన్లో ఉంది) ప్రాంతంలో జన్మించారు. ఈయన తల్లిదండ్రులు కృష్ణదేవి ఖురానా, గణపత్ రాయ్. ఐదుగురు సంతానంలో ఈయనే చిన్నవారు. 1952-60 మధ్య యూనివర్శిటీ ఆఫ్ బ్రిటిష్ కొలంబియాలో అధ్యాపకుడిగా చేశారు. 1966లో ఖురానా అమెరికా పౌరసత్వం పొందారు. 2011 నవంబర్ 9న 89ఏళ్ల వయసులో ఖురానా కన్నుమూశారు.