jio: ప్రీపెయిడ్ రీఛార్జీ ప్లాన్ల సవరణలో జియోను అనుసరించిన ఎయిర్టెల్
- వినియోగదారులను కోల్పోకుండా ఉండేందుకు జియోను అనుసరిస్తున్న సంస్థ
- ఉన్న ప్లాన్లకే కొత్త సవరణలు
- కాలపరిమితి, డేటా వాడకంలో మార్పులు
జియో వచ్చిన తర్వాత ఇతర టెలికాం సంస్థల పరిస్థితి అగమ్యగోచరంగా మారిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అతిపెద్ద టెలికాం నెట్వర్క్ అయిన ఎయిర్టెల్ సంస్థ తన వినియోగదారులను కోల్పోకుండా ఉండేందుకు జియో కంటే ఉత్తమ ఆఫర్లు ఇచ్చేందుకు యత్నిస్తోంది. అందులో భాగంగా జియో ఒక ఆఫర్ ప్రకటించగానే.. అచ్చం అలాంటి ఆఫర్‌నే ప్రవేశపెడుతోంది. చివరికి జియో చేసిన సవరణలనే తమ ప్లాన్లలో కూడా చేస్తోంది.
ఇటీవల న్యూఇయర్ ఆఫర్లో భాగంగా కొన్ని ప్లాన్ల ధరను తగ్గించడం, అదనపు డేటా ఇవ్వడం, కాలపరిమితి పెంచడం వంటి మార్పులను జియో ప్రకటించింది. దీంతో ఎయిర్టెల్ కూడా తన రూ.448, రూ.509 ప్లాన్లలో సరిగ్గా ఇలాంటి మార్పులనే చేసింది. రూ.448 ప్లాన్‌పై ప్రస్తుతం ఉన్న కాలపరిమితిని 70 రోజుల నుంచి 82 రోజులకు పెంచింది. ఈ ప్లాన్ కింద రోజుకో జీబీ చొప్పున 82జీబీ డేటాతో పాటు, అపరిమిత కాల్స్, రోజుకు 100 ఎస్సెమ్మెస్‌లు లభిస్తాయి. రూ.509 ప్లాన్‌లో సైతం 84రోజులుగా ఉన్న కాలపరిమితిని 91 రోజులకు పెంచింది. ఈ ప్లాన్‌లో రోజుకు 1జీబీ డేటా చొప్పున 91 జీబీ డేటా లభిస్తుంది. రూ.448 ప్లాన్‌లో ఉన్న సదుపాయాలే ఇందులోనూ లభిస్తాయి.