hollywood: అనుకున్నంత పని చేసిన హాలీవుడ్ నటీమణులు... అవార్డు ఫంక్షన్‌లో అనూహ్య నిరసన!
- నలుపు రంగు వస్త్రాలు ధరించి గోల్డెన్ గ్లోబ్ వేడుకకు హాజరు
- సమాన పారితోషికం, లైంగిక వేధింపులకు నిరసన
- సందేశాన్ని సరైన రీతిలో వెల్లడించిన వైనం
గోల్డెన్ గ్లోబ్ అవార్డుల వేడుకలో హాలీవుడ్ సెలబ్రిటీల తళుకుబెళుకులు అందరినీ ఆకర్షిస్తాయి. అవార్డు వేడుకలకు వారు ధరించే వస్త్రాల గురించి చర్చోపచర్చలు కొనసాగుతుంటాయి. కానీ ఈసారి మాత్రం అందుకు అవకాశం లేదు. ఎందుకంటే... అందరూ ఒకే రంగు దుస్తులు ధరించి వేడుకలకు హాజరయ్యారు. నిర్మాత హర్వీ వీన్‌స్టెయిన్ లైంగిక వేధింపుల ఘటన, నటులతో సమానంగా పారితోషికం, గుర్తింపు లేకపోవడం వంటి అంశాలకు నిరసనగా నటీమణులందరూ నలుపు రంగు దుస్తులు వేసుకుని అవార్డుల వేడుకకు హాజరుకావాలని నిర్ణయించుకున్న సంగతి తెలిసిందే.
అయితే ఆ నిర్ణయానికి పెద్దగా స్పందన వస్తుందని ఎవరూ ఊహించలేదు. అవార్డు వేడుకలో అందరి దృష్టినీ ఆకర్షించాలని, ప్రత్యేకంగా కనిపించాలని అనుకుంటారు, కానీ రెడ్ కార్పెట్ మీద పరిస్థితి అందుకు భిన్నంగా కనిపించింది. ఒకరిద్దరు మినహా దాదాపు అందరు నటీమణులు నలుపు రంగు వస్త్రాలు ధరించారు. అంతేకాకుండా వారికి మద్దతుగా నటులు కూడా సమాన పారితోషికం గురించి చెప్పే 50-50 అని రాసి ఉన్న బ్యాడ్జిలను కూడా ధరించారు.
అలాగే తామంతా ఏకమే అని సూచించడానికి గుంపులు గుంపులుగా ఫొటోలు దిగారు. అందాలు ఒలకబోయడమనే పద్ధతికి స్వస్తి పలికి సమస్య మీదకి దృష్టిని మరల్చే ప్రయత్నం చేశారు. సీనియర్ నటీమణులు మెరిల్ స్ట్రీప్, ఓప్రా విన్‌ఫ్రే, ఆష్లీ జడ్ వంటి వారు యువ నటీమణులకు మార్గదర్శం చేశారు. అవార్డులు గెల్చుకున్న నటీమణులు తమ ప్రసంగాల్లో ఈ సమస్యల గురించి ప్రత్యేకంగా ప్రస్తావించడం విశేషం. ఏదేమైనా వారంతా ఏకతాటి మీద నిలిచి తమ సమస్యను సరైన రీతిలో వెల్లడించి అందరి దృష్టిని ఆకర్షించారు.