TTD: అర్ధరాత్రి ఆఫీసులో ఫైళ్లను మాయం చేసే యత్నం.. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్లో కలకలం!
- టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తోన్న శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్
- సీఈవో నరసింహారావుపై అవినీతి ఆరోపణలు
- ఫైళ్లు తీసుకెళ్లకూడదని చెప్పిన మేకప్మేన్పై నరసింహారావు దాడి
- చాలా కాలంగా నిధులు దుర్వినియోగం అవుతున్నాయని ఆరోపణలు
టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తోన్న శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ సీఈవో నరసింహారావును అవినీతి ఆరోపణలు చుట్టుముట్టాయి. ఆయన నిన్న అర్ధరాత్రి కార్యాలయంలోని ఫైళ్లను తీసుకెళ్లేందుకు ప్రయత్నించారని తెలిసింది. ఈ విషయాన్ని గమనించిన మేకప్మన్ వెంకటేశ్వర రెడ్డి ఆయనను అడ్డుకోవడంతో ఈ విషయం బయటకు వచ్చింది. ఫైళ్లు తీసుకెళ్లకూడదని చెప్పిన తనపై నరసింహారావు దాడి చేసినట్టు వెంకటేశ్వర రెడ్డి అలిపిరి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం బయటకు వచ్చింది. తోటి ఉద్యోగిపై సీఈవో దాడి చేయడంతో ఆ ఛానెల్ ఉద్యోగులు ఈ రోజు విధులు బహిష్కరించారు.
చానెల్ ముందు నిరసనకు దిగి తమ సీఈవోకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ హోరెత్తించారు. తమ సీఈవో పదవీ కాలం గత ఏడాది డిసెంబర్ 30 తోనే ముగిసిందని, అయినప్పటికీ ఇంకా ఉద్యోగంలోనే కొనసాగుతూ అక్రమాలకు పాల్పడుతున్నారని ఉద్యోగులు అంటున్నారు. కొత్త సీఈవో వస్తే తాను చేసిన అవినీతి బయటపడుతుందనే ఆయన ఫైళ్లను మాయం చేస్తున్నారని ఆరోపించారు. ఎస్వీబీ చానెల్లో అవకతవకలు జరుగుతున్నట్లు చాలా కాలం నుంచి ఆరోపణలు ఉన్నాయి. ఆ చానల్ నిర్వహణ పేరుతో కోట్ల రూపాయల నిధులు దుర్వినియోగం అయ్యాయని కూడా పలుసార్లు వార్తలు వచ్చాయి.