Chandrababu: కుప్పంలో చంద్రబాబును ఓడిస్తేనే బీసీలకు న్యాయం జరుగుతుంది!: వైఎస్ జగన్
- చిత్తూరు జిల్లా పెద్దూరులో ప్రజా సంకల్ప యాత్ర
- చంద్రబాబు సొంత నియోజకవర్గంలోనే బీసీలు ఎక్కువ
- వాళ్లందరికీ ఆయన ఏం చేశారు?
- సెప్టెంబర్ లో బస్సుయాత్ర ప్రారంభిస్తా: జగన్
కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడుని ఓడిస్తేనే బీసీలకు న్యాయం జరుగుతుందని వైసీపీ అధినేత వైఎస్ జగన్ వ్యాఖ్యానించారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా చిత్తూరు జిల్లా పెద్దూరులో జగన్ మాట్లాడుతూ, చంద్రబాబు సొంత నియోజకవర్గమైన కుప్పంలోనే బీసీలు అధిక సంఖ్యలో ఉన్నారని, వాళ్లందరికీ చంద్రబాబు ఏం చేశారని ప్రశ్నించారు.
వైసీపీ గెలుపు కుప్పం నియోజకవర్గం నుంచే ప్రారంభం కావాలని, వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ సమన్వయకర్త చంద్రమౌళికి ఓటు వేసి గెలిపిస్తే, కేబినెట్ లో కూర్చోబెడతానని అన్నారు. ఇక్కడి ప్రజలు ఆ విధంగా చేస్తే చంద్రబాబు కంటే మెరుగ్గా కుప్పం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పారు. తన పాదయాత్ర ముగిసిన అనంతరం, సెప్టెంబర్ లో బస్సుయాత్ర ప్రారంభిస్తానని, అప్పుడు, కుప్పంలోని ప్రతి మండలంలో పర్యటిస్తానని ఈ సందర్భంగా జగన్ చెప్పారు.