Rs.200note: ఏటీఎంలలో రూ.200 నోట్లను పెంచాలంటూ బ్యాంకులకు ఆర్బీఐ తాజా ఆదేశాలు
- ఏటీఎంలలో వీలైనంత త్వరగా మార్పులు చేయాలి
- చిన్న నోట్లతో సౌకర్యంగా ఉంటుంది
- బ్యాంకులు, ఏటీఎం తయారీ కంపెనీలకు ఆర్ బీఐ ఆదేశాలు
ఆర్బీఐ రూ.200 నోట్లను ప్రవేశపెట్టి చాలా నెలలైనప్పటికీ చాలా మంది ఇప్పటికీ వాటి ముఖం చూసి ఉండరు. ఏటీఎం యంత్రాల్లో నోట్లను పెట్టే బాక్స్ లను రూ.200 నోట్లు పట్టేందుకు అనుగుణంగా మార్పులు చేయాల్సి ఉండడంతో బ్యాంకులు పెద్ద నోట్లతోనే నింపేస్తున్నాయి. కానీ, రూ.200 నోట్లను పట్టే విధంగా మార్పులు చేయడానికి ఆసక్తి చూపించడం లేదు. దీంతో ఆర్బీఐ తాజా ఆదేశాలు ఇవ్వాల్సి వచ్చింది. తక్కువ విలువ కలిగిన నోట్ల సరఫరాను పెంచాలన్న లక్ష్యంతో ఉన్న ఆర్బీఐ ఏటీఎం మెషిన్లలో మార్పులు చేయాలని ఆదేశించింది.
వీలైనంత త్వరలో ఏటీఎం మెషిన్లు రూ.200 నోట్లను డిస్పెన్స్ చేసే విధంగా వాటిల్లో మార్పులు చేయాలని బ్యాంకులు, ఏటీఎం తయారీ కంపెనీలను ఆదేశించింది. 2,000 నోట్ల కంటే చిన్న నోట్లను కలిగి ఉండడం సౌకర్యంగా పేర్కొంది. అయితే, దీన్ని పూర్తిగా అమలు చేసేందుకు ఐదారు నెలలు పడుతుందంటున్నారు.
దేశవ్యాప్తంగా ఉన్న 2.2 లక్షల ఏటీఎంలను ఇందుకు అనుగుణంగా మార్పు చేయాల్సి ఉంటుంది. ఇందుకు బ్యాంకులు ఎంతలేదన్నా రూ.110 కోట్లను ఖర్చు చేయాల్సి వస్తుంది. మరోవైపు పెద్ద నోట్లు ఉండడంతో విత్ డ్రా చేసుకునే మొత్తం కూడా పెరిగిపోతుండడం కేంద్ర ప్రభుత్వాన్ని ఆందోళనకు గురి చేస్తోందని, ఏటీఎంల నుంచి ఉపసంహరణల మొత్తాన్ని తగ్గించేందుకు వీలుగా చిన్న నోట్లతో నింపేయాలన్నది వ్యూహంగా పరిశీలకులు పేర్కొంటున్నారు.