Pawan Kalyan: అది జరిగిన రోజున ఖర్చైపోయేది పవన్ కళ్యాణే!: మహేశ్ కత్తి
- నిన్న ఓ చర్చా కార్యక్రమంలో నేను సంయమనం కోల్పోయిన మాట వాస్తవమే
- నన్ను తక్కువ చేసే వ్యాఖ్యలు చేస్తున్న పవన్ అభిమానులు
- వాటిని ఖండించని పవన్ పై నాకెలా గౌరవం ఉంటుంది?
- ఓ పోస్ట్ లో మహేశ్ కత్తి
నిన్న ‘ఏబీఎన్’లో నిర్వహించిన ఓ చర్చా కార్యక్రమంలో ఫిల్మ్ క్రిటిక్ మహేశ్ కత్తి, పవన్ కల్యాణ్ అభిమాని కల్యాణ్ దిలీప్ సుంకర మధ్య మాటల యుద్ధం జరిగింది. ఈ క్రమంలో మహేశ్ కత్తి ఘాటు విమర్శలు గుప్పించడమే కాకుండా, ఓ దశలో ఆయన సంయమనం కోల్పోయారు. ఈ విషయమై మహేశ్ కత్తి స్పందిస్తూ.. ఆ మాట వాస్తవమేనని చెబుతూ, తాను ఎందుకు సంయమనం కోల్పోవాల్సి వచ్చిందో స్పష్టం చేశారు. ఈ మేరకు తన ఫేస్ బుక్ ఖాతా ద్వారా ఆయన ఓ పోస్ట్ చేశారు.
‘నిన్న జరిగిన ఏబీఎన్ డిబేట్ లో నేను కొంత సంయమనం కోల్పోయానని కొందరు మిత్రులకు అనిపించింది. నిజమే. నాకు కూడా అనిపించింది. కాకపోతే అది ఏ పరిస్థితుల్లో అనేది కూడా గమనించాలని కోరుతున్నాను. నా మీద ఎంత హేయమైన దాడి జరుగుతున్నదో, నా వ్యక్తిగత జీవితాన్ని, నా కుటుంబ సభ్యులని, నా వృత్తిని, నా ఉనికిని న్యూనతపరుస్తూ ఎలాంటి వ్యాఖ్యలు పవన్ కళ్యాణ్ అభిమానులు అన్ని చోట్లా చేస్తున్నారో గమనించాలి. నేను ఫేమస్ అవ్వాలి అనుకుంటున్నానని.. నాకు ఏదో పార్టీ అండ ఉందని. నాకు ఎవరో డబ్బులు ఇస్తున్నారని.. ఇలా ఎన్నెన్నో ఆరోపణలు.
వీటిని దేనినీ ఖండించకుండా నిమ్మకు నీరెత్తినట్టు తమాషా చూస్తున్న పవన్ కళ్యాణ్. ఇలాంటి వ్యక్తి మీద నాకు ఎందుకు గౌరవం ఉండాలి? అతని రాజకీయ ఉద్దేశాల్ని ఎలా నమ్మాలి? అక్కడా నేను వ్యక్తిగత దూషణలు చెయ్యలేదు. పర్సనల్ లైఫ్ లోకి వెళ్ళలేదు. రేణు దేశాయ్ విషయం పబ్లిక్ గా జరిగిన విషయం. ఫ్యాన్స్ కి బెదిరి ఒక్క మాట కూడా మాట్లాడకుండా మూలనక్కిన ఈ వ్యక్తి గురించి నేను మాట్లాడితే వ్యక్తిగతం ఎలా అవుతుంది? మర్యాద హద్దులు దాటుతున్న పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి నేను ఇంకా మర్యాదలు దాటకుండానే సమాధానం ఇస్తున్నాను. ఇంకా సంయమనం పాటిస్తూనే ఉన్నాను. ఆ చెలియలకట్ట తెగేదాకా తీసుకురాకండి. అది జరిగిన రోజున ఖర్చైపోయేది పవన్ కళ్యాణ్ మాత్రమే అని గుర్తుపెట్టుకోండి’ అని పేర్కొన్నారు.